తాను చెక్కిన హీరోతో వినాయక్?

తాను చెక్కిన హీరోతో వినాయక్?

మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరోతో ‘ఖైదీ నంబర్ 150’ సినిమా చేసిన వి.వి.వినాయక్.. ఆ తర్వాత తన స్థాయికి తగ్గ హీరోతో సినిమా చేయలేకపోయాడు. మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తో సినిమాను మొదలుపెట్టాడు. ఈ సినిమా తర్వాత కూడా వినాయక్‌కు పెద్ద హీరోలు దొరికేలా లేరు. అతను బెల్లంకొండ శ్రీనివాస్‌తో సినిమా చేసే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. తన తొలి సినిమా ‘ఆది’ నిర్మాతల్లో ఒకడైన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి వినాయక్ ఓ కమిట్మెంట్ ఇచ్చాడట. తేజు సినిమా పూర్తయ్యాక అతడి బేనర్లోనే మూవీ చేస్తాడట. ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్‌‌ను ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం చేసింది వినాయకే అన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాతో శ్రీనివాస్ లాంచింగ్ బాగానే జరిగింది. బడ్జెట్ ఎక్కువ కావడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్ అయింది కానీ.. దానికి వసూళ్లయితే బాగానే వచ్చాయి. ప్రస్తుతం శ్రీనివాస్ శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్ష్యం’ అనే సినిమా చేస్తున్నాడు. వినాయక్‌తో పాటు బుజ్జికి కూడా బెల్లంకొండ సురేష్ సన్నిహితుడు కావడంతో వీళ్లిద్దరూ కలిసి శ్రీనివాస్‌తో సినిమా చేయడానికి ఓకే చెప్పారట. నిజానికి వినాయక్ లాంటి మాస్ మసాలా.. రొటీన్ సినిమాలు చేసే డైరెక్టర్లకు ఇప్పుడు స్టార్ హీరోల డేట్లు దొరకడం కష్టంగానే ఉంది. ఇప్పుడు స్టార్లందరూ వైవిధ్యమైన సినిమాలు చేసే దర్శకుల వైపు చూస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు