ఇండియా.. ల‌క్ష క‌రోనా కేసులు

Corona In Telangana
Corona In Telangana

ఆ దేశంలో ఏకంగా ల‌క్ష ప్ల‌స్ క‌రోనా పాజిటివ్‌‌ కేసుల‌ట‌.. ఒక్క రోజులో అన్ని వేల కేసుల‌ట‌.. వందల్లో మ‌ర‌ణాల‌ట‌.. అంటూ నెల కింద‌ట వేరే దేశాల గురించి వార్త‌లు చ‌దువుకునే వాళ్లం. ఐతే ఇప్పుడు ఇండియానే ఆ స్థితికి వ‌చ్చేసింది. ఇండియాలో క‌రోనా కేసుల సంఖ్య సోమ‌వారం ల‌క్ష మార్కును ట‌చ్ చేసేసింది.

కొన్ని రోజులుగా స‌గ‌టున రోజుకు 3-4 వేల కేసులు న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఆదివారం నాటికి దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 96 వేల మార్కును దాటింది. సోమ‌వారం అన్ని రాష్ట్రాల్లో క‌లిపి కేసుల సంఖ్య 4 వేలు దాటిపోయింది. దీంతో ఇండియా ల‌క్ష క‌రోనా కేసుల మార్కును ట‌చ్ చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ల‌క్ష ప్ల‌స్ క‌రోనా కేసులు న‌మోదైన 11వ దేశం భార‌త్.

ఇండియా ఇప్ప‌టికే చైనాను మించి క‌రోనా కేసులు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే. అమెరికాలో అత్య‌ధికంగా మూడున్న‌ర‌ ల‌క్ష‌ల మందికి పైగా క‌రోనా బారిన ప‌డ్డారు. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసుల సంఖ్య 2300 దాకా ఉంది. తెలంగాణ‌లో కేసులు 1600 మార్కును దాటాయి.

దేశంలో అత్య‌ధిక క‌రోనా కేసులున్న రాష్ట్రం మ‌హారాష్ట్ర‌నే. మొత్తం ఇండియా కేసుల్లో మూడో వంతుకు పైగా ఇక్క‌డే ఉన్నాయి. అక్క‌డ కేసుల సంఖ్య 35 వేల‌ను దాటేసింది. సోమ‌వారం ఒక్క‌రోజే 2 వేల‌కు పైగా కేసులు ఆ రాష్ట్రంలో న‌మోద‌య్యాయి.

త‌మిళ‌నాడులో కూడా క‌రోనా ఉద్ధృతి బాగా క‌నిపిస్తోంది. అక్క‌డ కేసుల సంఖ్య 12 వేల మార్కును ట‌చ్ చేసింది. సోమ‌వారం 600 దాకా కేసులు న‌మోద‌య్యాయి. గుజ‌రాత్ సైతం దాదాపు 12 వేల కేసుల‌తో కొన‌సాగుతోంది.