ఆంధ్ర‌జ్యోతి ఈనాడు కే షాక్ ఇచ్చింది

ఆంధ్ర‌జ్యోతి ఈనాడు కే షాక్ ఇచ్చింది

తెలుగు ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేయాల్సిన అవ‌స‌రం లేని వాటిల్లో ఈనాడు ఒక‌టి.   వార్త‌ల్ని అందించే మీడియా సంస్థ కంటే ఎక్కువ‌గా తెలుగోళ్ల జీవితాల్ని ప్ర‌భావితం చేసిన ఈ మీడియా సంస్థకు సంబంధించిన అంత‌ర్గ‌త అంశాలు చాలా ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి. అంద‌రి విష‌యాలను వార్తాంశాలుగా అచ్చేసే ఈనాడు.. త‌న‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు రావ‌టానికి  అస్స‌లు ఇష్ట‌ప‌డ‌దు.  

తాను చెప్పిందే వార్త అన్న రోజుల నుంచి తానే వార్తాంశంగా మారతాన‌న్న విష‌యాన్ని ఈనాడు ఊహించి ఉండ‌దు. మారిన పాఠ‌కాస‌క్తి  విష‌యం మీద త‌ర‌చూ మేథోమ‌ధ‌నం చేసే ఈనాడుకు.. డిజిట‌ల్ రీడ‌ర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంద‌న్న విష‌యం మీద అవ‌గాహ‌న త‌క్కువ‌నే చెప్పాలి. అందుకే.. త‌న‌కు సంబంధించిన విష‌యాల్ని వీలైనంత గ‌ట్టుగా ఉంచాల‌ని భావిస్తుంటుంది. అయితే.. సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని ఈనాడు అనుకున్న‌దేదీ జ‌ర‌గ‌టం లేదు. తానెంత గుట్టుగా ఉంచాల‌నుకున్న విష‌యాలు కూడా బ‌య‌ట‌కు పొక్కేస్తున్నాయి.

అదెంత వ‌ర‌కూ వెళ్లిందంటే.. ఈ మ‌ధ్య‌న ఈనాడు నుంచి ఒక ఎడిటోరియ‌ల్ స‌భ్యుడు (సీనియ‌ర్ ఉద్యోగి కాదు) జాబ్‌కు రిజైన్ చేసి ఆంధ్ర‌జ్యోతికి వెళ్లాల‌నుకున్న  విష‌యాన్ని తెలుసుకొని ఎండీ (రామోజీరావు కుమారుడు కిర‌ణ్‌) త‌న ద‌గ్గ‌ర‌కు పిలిపించుకొని గంట పాటు మాట్లాడిన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. గంట కాదు.. 35 నిమిషాలే మాట్లాడ‌రంటూ ఈనాడు ఎడిటోరియ‌ల్ స‌భ్యులు కొంద‌రు త‌ప్పును క‌రెక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటే.. ఈనాడుకు సంబంధించిన కీల‌క‌మైన స‌మాచారం అలా బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌టం ఏమిట‌న్న‌ది ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.
ఇంత‌కీ ఈనాడు కోల్డ్ స్టోరేజ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ట్లుగా ప్ర‌స్తావించిన అంశంలోకి వెళితే..

ఈనాడు ఛైర్మ‌న్ రామోజీరావుకు.. ఆయ‌న కుమారుడు  కిర‌ణ్‌కు కొత్త‌గా ఏదైనా చేయాల‌న్న‌ది ఆశ‌. ఇప్ప‌టికి ఉన్న 17-18 ల‌క్ష‌ల స‌ర్క్యులేష‌న్‌ను 20 ల‌క్ష‌ల‌కు తీసుకెళ్లాల‌న్న‌ది ఒక స్వ‌ప్నం. ఇందుకోసం కొన్నేళ్లుగా వారు టార్గెట్లు పెట్టుకున్నారు. ఈనాడు పేజీల్లో మార్పులు చేసిన ప్ర‌తిసారీ భారీగా స‌ర్క్యులేష‌న్ పెరిగింద‌ని.. అదే తీరులో మ‌రోసారి మార్పుల‌తో త‌న అమ్మ‌కాల్ని పెంచుకోవాల‌న్న‌ది లక్ష్యం.

ఇందుకోసం.. ఇప్ప‌టికే ఉన్న ఫీచ‌ర్లు.. పేజీల‌కు భిన్నంగా.. యువ పాఠ‌కుల (18-38)  మ‌న‌సుల్ని దోచుకునేలా.. వారిని ఈనాడుతోనే అట్టి పెట్టుకునేలా.. ఇంగ్లిషు ప‌త్రిక‌ల ఆక‌ర్ష‌ణ‌కు లోను కాకుండా ఉండ‌టానికి తెగ ప్ర‌య‌త్నం చేస్తుంటుంది. ఇప్ప‌టికి దాదాపు ప‌దేళ్ల నుంచి కొత్త పేజీల కోసం ఎన్నో ప్ర‌య‌త్నాలు చేసింది.

ఇందుకు సంస్థ‌లో బాగా ప‌ని చేస్తారు.. బాగా రాస్తార‌న్న న‌మ్మ‌కం ఉన్న ఎడిటోరియ‌ల్ స‌భ్యుల్ని ఎంపిక చేసి వారినో టీంగా త‌యారు చేసి.. మేథోమ‌ధ‌నం చేయించింది. ఇలా దాదాపు నాలుగు బృందాలు శ్ర‌మించి.. కొత్త కొత్త ఆలోచ‌న‌ల్ని త‌యారు చేసినా ఫైన‌ల్ కాని ప‌రిస్థితి. కొత్త పేజీల్ని తీసుకురావాల‌ని అనుకొని బ‌డ్జెట్ లెక్క‌ల్ని ఓకే చేసుకున్నంత‌నే అనుకోని అవాంత‌రాల‌తో ఈ స్పెష‌ల్ పేజీల ప్రాజెక్ట్ కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిపోయేది.

దాదాపు ఆర్నెల్ల క్రితం మ‌రోసారి ఇలాంటి క‌స‌ర‌త్తే మొద‌లెట్టింది ఈనాడు. ఇందుకోసం భారీగా టీంను సిద్ధం చేసింది.అంతేనా..రామోజీ ఫిలిం సిటీ నుంచి వారిని ప్ర‌త్యేక అసైన్ మెంట్ కింద న‌గ‌రంలోని ఖైర‌తాబాద్ ప్ర‌ధాన కేంద్రంలో కొంత ప్లేస్‌ను ఖాళీ చేసి మ‌రీ వారికి డెస్క్ కేటాయించింది. అంతేనా.. ఈనాడులో విశేషంగా క‌నిపించే వ‌సుంధ‌ర‌.. హాయ్ బుజ్జి.. ఈత‌రం.. సిరి.. లాంటి డెస్కుల్ని ఖైర‌తాబాద్‌కు తాత్కాలికంగా త‌ర‌లిచింది.

ఈ పేజీల కోసం జిల్లాల నుంచి ప్ర‌త్యేకంగా కొంద‌రిని ఎంపిక చేసి హైద‌రాబాద్‌కు తీసుకొచ్చింది. స‌ర్వం సిద్ధ‌మ‌య్యాక క‌స‌ర‌త్తు మీద క‌స‌ర‌త్తు మొద‌లెట్టి  ఫైన‌ల్ అవుట్ పుట్ ను తీసుకొచ్చింది. అంతా బాగుంద‌నుకున్న వేళ‌.. ఈనాడు ఛైర్మ‌న్ రామోజీరావుకు పేజీలు న‌చ్చ‌లేద‌న్న మాట వినిపించింది. దీంతో మ‌ళ్లీ శ్ర‌మించిన ఈనాడు ఎడిటోరియ‌ల్ సైన్యం మ‌ళ్లీ కొంగొత్త క‌స‌ర‌త్తు మొద‌లెట్టింది.

చివ‌ర‌కు అంతా సిద్ధ‌మ‌నుకొని దీపావ‌ళికి షురూ చేద్దామ‌నుకున్న వేళ‌.. ఆంధ్ర‌జ్యోతి రూపంలో అనుకోని అవాంత‌రం ఎదురైంది. ఈనాడు స్పెష‌ల్ పేజీల ప్రాజెక్టు గురించి మొద‌టి నుంచి స‌మాచారం ఉన్న జ్యోతి ఎడిటోరియ‌ల్ బృందం.. తాము కూడా కొత్త పేజీల్ని తీసుకొచ్చేసింది. ఈ వేగాన్ని ఏ మాత్రం ఊహించని ఈనాడు త‌న స్పెష‌ల్ పేజీల ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టేసింది. తానే మాత్రం ఊహించ‌ని రీతిలో ఆంధ్ర‌జ్యోతి తీసుకొచ్చిన ప్ర‌త్యేక పేజీల‌తో పాటు.. పేప‌ర్ పేజీలు కూడా భారీగా (నాలుగు పేజీలే అయినా పెరిగిన న్యూస్ ప్రింట్ ధ‌ర‌తో చూస్తే  ఇది భారీ ఖ‌ర్చేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు)  పెంచేయ‌టంతో ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితి నెల‌కొంద‌ని చెబుతారు.

పెరిగిన న్యూస్ ప్రింట్ ధ‌ర‌ల కార‌ణంతో పెంచిన పేజీల వ‌ల్ల అనుకున్న రీతిలో ప్ర‌యోజ‌నం (ప్ర‌క‌ట‌న‌లు ప్ల‌స్ స‌ర్య్కులేష‌న్‌)  ల‌భించ‌క‌పోతే జ‌రిగే న‌ష్టం ఆర్థికంగా ఎక్కువ ఉంటుంది. అందుకే ఆచితూచి నిర్ణ‌యం తీసుకోవ‌టంలో భాగంగా కొద్ది రోజులు మ‌ళ్లీ సుప్త‌చేత‌నావ‌స్థ‌లో పెట్టేసి.. అంతిమంగా పేజీలు ఇవ్వాల‌ని డిసైడ్ అయ్యారు. దీని ఫ‌లితంగానే రెండు రోజులుగా రెండు కొత్త పేజీలు ఈనాడులో వ‌చ్చేశాయి.

ఎన్నోఏళ్లుగా ఈనాడు ఏడో పేజీలో ఉండే వ‌సుంధ‌ర పేజీని తొమ్మిదో పేజీకి స‌ర్దేసి.. ఏడో పేజీలో కొత్త‌గా తాము తెస్తున్న పేజీల‌కు స్థానం క‌ల్పించారు. ఇందులో భాగంగా శుక్ర‌వారం 'ర‌య్‌..ర‌య్' పేరిట మోటార్ అండ్ గ్యాడ్జెట్స్ పేజీని..  శ‌నివారం 'విజేత' పేరుతో  స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్‌కు సంబంధించి స‌రికొత్త కోణాన్ని ఆవిష్క‌రించే  క‌థ‌నాల‌తో కూడిన పేజీ తీసుకొచ్చేశారు. మొత్తంగా చెప్పాలంటే.. ఏళ్ల‌కు ఏళ్లు ఉధృతంగా ప‌ని చేయించి.. ఆపై వ‌ర్క్ వుట్ కాదేమోన‌న్న  ఆలోచ‌న‌ల‌తో కోల్డ్‌స్టోరేజీకి పంపించే ప్ర‌త్యేక పేజీ ప్రాజెక్టు ఎట్ట‌కేల‌కు తెలుగు ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చింద‌ని చెప్పాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు