సినిమా జ‌నాల‌కు న‌చ్చ‌లేద‌ని మ‌ళ్లీ తీస్తార‌ట‌

సినిమా జ‌నాల‌కు న‌చ్చ‌లేద‌ని మ‌ళ్లీ తీస్తార‌ట‌

ఇదో చిత్ర‌మైన ప్ర‌యోగంగా చెప్పాలి. ఏదైనా సినిమా విడుద‌లైన త‌ర్వాత‌.. ప్రేక్ష‌కుల స్పంద‌న‌కు త‌గ్గ‌ట్లుగా మార్పులు చేర్పులు చేయ‌టం మామూలే. ఒక‌వేళ‌.. అలాంటి మార్పులు చేసిన త‌ర్వాత కూడా ఫ‌లితం అనుకున్న‌ట్లుగా రాక‌పోతే ఏం చేస్తారు? అన్న ప్ర‌శ్న వేసుకుంటే.. ఏం చేస్తాం..టైం బాగోలేద‌ని ఊరుకోవ‌టం మిన‌హా ఏం చేయ‌గ‌ల‌మ‌న్న స‌మాధానం వ‌స్తుంది.

కానీ.. అందుకు భిన్నంగా ఏ మాత్రం ఊహించ‌ని రీతిలో నిర్ణ‌యం తీసుకొని సంచ‌ల‌నం సృష్టించాడు ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్‌. ఇటీవ‌ల త‌మిళం.. తెలుగులో ఒక సినిమాను విడుద‌ల చేశారు. త‌మిళంలో నెంజిల్ తునివిరుందాల్ పేరిట రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగులో కేరాఫ్ సూర్య గా రిలీజ్ అయ్యింది.


సందీప్ కిష‌న్ హీరోగా.. మెహ‌రీన్ హీరోయిన్ గా న‌టించిన ఈ థ్రిల్ల‌ర్ కు  సుశీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సినిమాకు స‌రైన ప్ర‌చారం లేక‌పోవ‌టం.. లాంచ్ చేయ‌టం దగ్గ‌ర నుంచి సినిమా మీద అంచ‌నాలు పెరిగేలా చేయ‌టంలో ద‌ర్శ‌క నిర్మాత‌లు అడ్డంగా ఫెయిల్ అయ్యారు.

దీంతో.. ఈ సినిమాకు ఆశించినంత కాదు క‌దా.. అస్స‌లు పేరు రాలేదు. ప్రేక్ష‌కుల మ‌దిలో పెద్ద‌గా రిజిస్ట‌ర్ కాలేదు. తెలుగులోనే కాదు.. త‌మిళంలోనూ ఇలాంటి ప‌రిస్థితి. దీంతో.. ఆలోచ‌న‌లో ప‌డ్డ ద‌ర్శ‌కుడు తొలుత ఈ సినిమాలో హీరోయిన్ మెహ‌రీన్‌కు చెందిన 20 నిమిషాల స‌న్నివేశాల‌కు క‌త్తెర వేశారు.

రిలీజ్ అయ్యాక ట్రిమ్ చేసినా... సినిమా విజ‌యానికి ఏ మాత్రం సాయ‌ప‌డ‌లేదు. తాను ఎన్నో ఆశ‌లు పెట్టుకొని తీసిన సినిమాకు ప్రేక్ష‌కుల నుంచి సానుకూల స్పంద‌న రాక‌పోవ‌టంతో ద‌ర్శ‌కుడు సుశీంద్ర‌న్ ఊహించ‌ని నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. రిలీజ్ చేసిన సినిమాను థియేట‌ర్ల నుంచి ఉప‌సంహ‌రించుకున్నారు. ఈ సినిమా విష‌యంలో తాము అనుకున్న‌వేమీ జ‌ర‌గ‌లేద‌ని.. అందుకే కొన్ని మార్పులు చేయాల‌ని తాము భావిస్తున్న‌ట్లుగా ద‌ర్శ‌కుడు పేర్కొన్నారు.
ఈ సినిమాకు తాము అనుకున్న మ‌రిన్ని మార్పులు మ‌ళ్లీ చేసి.. ఇప్పుడు ఏ థియేట‌ర్ల‌లో అయితే విడుద‌ల చేశారో మ‌ళ్లీ అదే థియేట‌ర్ల‌లో కొత్త వెర్ష‌న్‌ను మ‌రోసారి గ్రాండ్ గా రిలీజ్ చేస్తామ‌ని చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఈ త‌ర‌హా ప్ర‌యోగం చేసిన ద‌ర్శ‌కుడిగా సుశీంద్ర‌న్ నిలిచిపోతారు. ఒక సినిమా రెండు ట్రీట్ మెంట్లు అన్నంత‌నే ఈ సినిమానే గుర్తుకు వ‌స్తుందేమో? ఈ నిర్ణ‌యం త‌మిళం వ‌ర‌కూ తీసుకున్నారు. తెలుగుకు సంబంధించి అధికారికంగా ఎలాంటి వివ‌రాలు వెలువ‌డ‌లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు