రాజమౌళితో ఎన్టీఆర్-చరణ్.. షూటింగ్ ఎప్పుడు?

రాజమౌళితో ఎన్టీఆర్-చరణ్.. షూటింగ్ ఎప్పుడు?

నిన్న రాత్రి రాజమౌళి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో కలిసి ఉన్న ఫొటో పెట్టడం ఆలస్యం.. ట్విట్టర్ షేకైపోయింది. ఫేస్ బుక్ పేలిపోయింది. వాట్సాప్ వేడెక్కిపోయింది. సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఈ ఫొటో వైరల్ అయిపోయింది.

ముందు రాజమౌళి ఏదో సరదాకి ఈ ఫొటో పెట్టారనుకున్నారు కానీ.. తర్వాత వీళ్లిద్దరితో కలిసి జక్కన్న మల్టీస్టారర్ తీయబోతున్నాడన్న సమాచారం బయటికి వచ్చింది. రాజమౌళి ఈ ఫొటోనే తన ట్విట్టర్ పేజీ కవర్ ఫొటోగా కూడా మార్చేయడంతో ఇక సందేహాలకు పూర్తిగా తెరపడిపోయింది. చాలామంది పీఆర్వోలు కూడా ఈ మల్టీస్టారర్ నిజమే అని ధ్రువీకరించారు. ఇక అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావడమే తరువాయి అంటున్నారు.

ఐతే ఎన్టీఆర్, చరణ్‌లతో రాజమౌళి మల్టీస్టారర్ ఎప్పుడు ఉంటుందన్న దాని మీదే ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. కొందరేమో ఫిబ్రవరిలోనే సినిమా మొదలంటుంటే.. ఇంకొందరేమో వచ్చే ఏడాది ఆగస్టులోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని అంటున్నారు. ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా వేరే ప్రాజెక్టులు కమిటై ఉన్నారు. ఈ విషయం రాజమౌళికి కూడా తెలుసు. వాటిని పక్కన పెట్టి రాజమౌళితో సినిమా చేస్తారని అనుకోలేం.

అలాగే ఆ సినిమాలు చేస్తూ రాజమౌళి సినిమాను కూడా చేస్తారా అన్నది కూడా సందేహమే. జక్కన్న సినిమా అంటే డీవియేషన్లకు అవకాశముండదు. పూర్తిగా ఆ సినిమాకే డెడికేట్ అవ్వాలి. పైగా రాజమౌళి సినిమా స్క్రిప్టు పక్కాగా రెడీ కావడానికి కూడా టైం పడుతుంది. కాబట్టి ఈ సినిమా అంత త్వరగా ఏమీ మొదలుకాకపోవచ్చని భావిస్తున్నారు. బోయపాటిత చరణ్.. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమాలు పూర్తి చేసి వచ్చే ఏడాది ద్వితీయార్ధానికి రాజమౌళికి అందుబాటులోకి రావచ్చని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు