సురేందర్.. ‘సైరా’లోకి అసలెలా వచ్చాడు?

సురేందర్.. ‘సైరా’లోకి అసలెలా వచ్చాడు?

స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్లు.. కొంచెం కామెడీ టచ్ ఉన్న యాక్షన్ సినిమాలు చేయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్నాడు సురేందర్ రెడ్డి. అలాంటి దర్శకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి చారిత్రక నేపథ్యం ఉన్న వ్యక్తి కథను తెరకెక్కించడానికి దర్శకుడిగా ఎంపికవుతాడని ఎవరూ అనుకోలేదు. మరి సురేందర్ అసలెలా ఈ ప్రాజెక్టులోకి వచ్చాడు.. అన్నది చాలామందిలో ఉన్న సందేహం. ఈ సందేహానికి రామ్ చరణ్ ఓ ఇంటర్వ్యూలో జవాబిచ్చాడు.

‘‘సురేందర్ రెడ్డితో నేను చేసిన ‘ధృవ’ ప్రమోషన్ల కోసం అమెరికాకు వెళ్లాం. ఓ సాయంత్రం సూరితో కలిసి మాట్లాడుతున్నపుడు తర్వాత సినిమా గురించి అడిగాను. నాన్నగారి కోసం ఒక కథ చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. అందుకు అవకాశముందా అని అడిగాడు. నేను వెంటనే నాన్నకు ఫోన్ చేశాను. అదే సమయంలో ఆయన పరుచూరి సోదరులతో కలిసి ఉయ్యాలవాడ సినిమాకు సంబంధించి కథా చర్చలు జరుపుతున్నారు. సురేందర్ విషయం చెప్పగానే వచ్చి కలవమన్నారు. వీళ్లిద్దరి మధ్య మీటింగ్ ఏర్పాటు చేశాను. తర్వాత నాన్న సూరిని ఓకే చేశాడు.

‘సైరా’ బాధ్యతలు సురేందర్ తీసుకోగానే ఈ కథ మరో స్థాయికి వెళ్లింది. పదేళ్ల క్రితమే ఈ కథ తయారైంది. ఐతే అప్పటికి.. ఇప్పటికి కథలో చాలా మార్పులొచ్చాయి. తన టీంతో కలిసి సూరి ఈ కథను చాలా మార్చాడు. ఈ కథ ఎవరికి చె్పినా అద్భుతంగా ఉందని.. ఎప్పుడెప్పుడు చూద్దామా అనిపిస్తోందని అంటున్నారు’’ అని చరణ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు