ఎన్టీఆర్‌ పాత్రకు ఆ దర్శకుడట..

ఎన్టీఆర్‌ పాత్రకు ఆ దర్శకుడట..

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తీయబోయే ఎన్టీఆర్ సినిమా.. రామ్ గోపాల్ వర్మ చేయబోయే ఎన్టీఆర్ మూవీ.. ఎప్పుడు మొదలవుతాయో, ఎప్పుడు పూర్తవుతాయో స్పష్టత లేదు. కానీ ఈ లోపే ఎన్టీఆర్ జీవిత కథతో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ అనే సినిమా తీసేస్తున్నట్లు హడావుడి చేస్తున్నాడు దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. ఐతే కొన్ని రోజుల కిందటే సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టేసినట్లు చెప్పాడు కానీ.. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ఎవరు పోషిస్తారన్న విషయంలో మాత్రం స్పష్టత లేదు. లక్ష్మీపార్వతి పాత్ర విషయంలో రోజుకో పేరు చెబుతున్నాడు కేతిరెడ్డి.

ఇప్పుడు ఎన్టీఆర్ పాత్ర విషయంలోనూ ఒక పేరును తెరపైకి తెచ్చాడు కేతిరెడ్డి. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ మహేష్ మంజ్రేకర్‌తో ఎన్టీఆర్ పాత్ర చేయించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పాడు. మహేష్ ఎన్టీఆర్ పాత్ర చేయడానికి ఆసక్తిగానే ఉన్నట్లు ఆయన చెప్పాడు. ఒకప్పుడు దర్శకుడిగా బిజీగా ఉన్న మంజ్రేకర్.. ఆ తర్వాత నటుడిగా మారాడు.

తెలుగులో ఇంతకుముందు ఆయన ‘ఒక్కడున్నాడు’, ‘అదుర్స్’, ‘అఖిల్’ లాంటి సినిమాల్లో కీలక పాత్రలు చేశాడు. మరి ఎన్టీఆర్ పాత్రకు మహేష్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి. ఆయన ఈ పాత్ర చేస్తే బాగానే ఉండొచ్చు. మరోవైపు లక్ష్మీపార్వతి పాత్ర విషయంలో కొత్తగా ‘గరుడవేగ’ హీరోయిన్ పూజా కుమార్ పేరు వినిపిస్తోంది. మరి చివరికి ప్రధాన పాత్రలకు ఎవరు ఖరారవుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు