అల్లు వర్గం తిరుగుబాటు దేనికి?

అల్లు వర్గం తిరుగుబాటు దేనికి?

నంది అవార్డుల రభస చూస్తే మెగా హీరోస్‌ వర్సెస్‌ ఏపీ స్టేట్‌ గవర్నమెంట్‌ గొడవలా అనిపించవచ్చు. కానీ కాస్త నిశితంగా పరిశీలిస్తే, మెగా హీరోలందరి తరఫున జరుగుతున్న గొడవ కాదిది. ప్రధానంగా అల్లు అర్జున్‌ గణం ఈ వివాదాన్ని తీవ్రతరం చేస్తోంది. అల్లు అర్జున్‌ వర్గమే నంది అవార్డులకి వ్యతిరేకంగా గళమెత్తింది. అల్లు అర్జున్‌కి అత్యంత ఆప్తుడయిన బన్ని వాస్‌ ఇంతవరకు వివాద రహితుడిగా వున్నాడు.

కానీ నంది అవార్డుల విషయంలో మెగా హీరోల పట్ల చూపుతోన్న వివక్ష పట్ల బహిరంగంగా నిరసన వ్యక్తం చేయడమే కాకుండా చర్చాగోష్టి కార్యక్రమాల్లోను బన్నీ వాస్‌ పాల్గొనడం ఆశ్చర్య పరుస్తోంది. అల్లు అరవింద్‌, అల్లు అర్జున్‌ పర్మిషన్‌ లేకుండా, వారి ప్రోత్సాహం లేకుండా ఇంతటి కాంట్రవర్సీలో మెయిన్‌ ఫేస్‌ అవడానికి బన్నీ వాస్‌ సాహసించడు. అలాగే 'రేసుగుర్రం' నిర్మాత నల్లమలుపు బుజ్జి కూడా ఎప్పుడూ మీడియాకి దూరంగా వుంటాడు. అతను సైతం తమ సినిమాకి, తమ హీరోకి జరిగిన అన్యాయం పట్ల గళం విప్పాడు.

గుణశేఖర్‌ సైతం 'రుద్రమదేవి' చిత్రానికి అల్లు అర్జున్‌కి బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నంది ప్రకటించడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తపరచడమే కాకుండా, అల్లు అర్జున్‌ స్టార్‌డమ్‌ని కించపరిచే కుట్రలాంటిది జరిగిందనే సంకేతాలు పంపించడం గమనార్హం. అల్లు ఫాదర్‌ అండ్‌ సన్‌ ఇద్దరూ డైరెక్టుగా బయటపడకపోయినప్పటికీ ఈ వివాదం వారి చుట్టూ, వారి సూచనలకి తగ్గట్టు జరుగుతోందని మీడియా వాళ్లే గుసగుసలాడుకుంటున్నారు. ఇంత ఓపెన్‌గా ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారనేది తెలియడం లేదు కానీ మునుపెన్నడూ లేని విధంగా నంది అవార్డుల పట్ల వ్యతిరేక పవనాలు మాత్రం బలంగా వీస్తున్నాయి. మరి ఇవి ఎటు దారి తీస్తాయో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు