నంది అవార్డులపై దుమ్ముదులిపేశారు

నంది అవార్డులపై దుమ్ముదులిపేశారు

నంది అవార్డుల రగడ రోజు రోజుకూ పెద్దదవుతోంది. నిన్నటి దాకా విమర్శల దాడి ఓ మోస్తరుగా ఉండగా.. ఈ రోజు అది తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పటికే తెలుగు దేశం ప్రభుత్వ తీరును ప్రెస్‌ నోట్‌తో దుయ్యబట్టిన గుణశేఖర్.. ఇప్పుడు ప్రెస్ మీట్ వరకు వచ్చేశాడు. అతడికి ‘రేసుగుర్రం’ నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వెంకటేశ్వరరావు కూడా తోడయ్యారు. ముగ్గురూ కలిసి ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డుల కమిటీని దమ్ముదులిపేశారు.

‘రేసుగుర్రం’ 2014 సంవత్సరానికి అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా అని.. జనం మెచ్చిన సినిమాకు ఏ అవార్డులూ ఎందుకివ్వలేదని వారు ప్రశ్నించారు. అల్లు అర్జున్‌కు తాము ప్రెస్ మీట్ పెట్టిన విషయం తెలియదని, అతను ఎక్కడో హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నాడని బుజ్జి అన్నాడు. ఒక హిట్ సినిమా తీయడం అంత సులువు కాదని.. అలాంటి సినిమా తీశాం కాబట్టే కడుపు మండి తాము మాట్లాడుతున్నట్లు అతను చెప్పాడు. తమను రోడ్డుకెక్కొద్దని సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ అంటున్నాడని.. ముందు ఆయన ఒక హిట్ సినిమా తీసి చూపించాలని వారు సవాలు విసిరారు.

‘రేసుగుర్రం’తో పాటు మిగతా సినిమాల గురించి కూడా వీరు మాట్లాడారు. ‘బాహుబలి’కి ప్రభాస్‌కు ఉత్తమ నటుడి అవార్డు ఎందుకు ఇవ్వలేదని.. ‘మనం’ సినిమాను ఉత్తమ సినిమాగా ఎందుకు ప్రకటించలేదని.. ‘రుద్రమదేవి’ సంగతేంటని ప్రశ్నించారు. ‘రుద్రమదేవి’కి తీవ్ర అన్యాయం జరిగిందని గుణశేఖర్ అన్నాడు. అల్లు అర్జున్‌ను ఉత్తమ సహాయ నటుడిగా కాకుండా, ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా ఎంపిక చేయడం అతడిని అవమానించడమే అని గుణ అభిప్రాయపడ్డాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు