‘లెజెండ్’కు అన్ని నందులా?

‘లెజెండ్’కు అన్ని నందులా?

నిన్న ఉన్నట్లుండి హఠాత్తుగా మూడేళ్ల కాలానికి నంది అవార్డులు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆ అవార్డుల్లో కొన్ని బాగానే అనిపించాయి. కొన్ని అవార్డుల విషయంలో మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందులో ప్రధానంగా చర్చ జరుగుతున్నది ‘లెజెండ్’, ‘మనం’ సినిమాల గురించే. తెలుగులో వచ్చిన ఓ అరుదైన చిత్రంగా గుర్తింపు తెచ్చుకున్న ‘మనం’ సినిమాను 2014 కాలానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా ఎంపిక చేయడం అందరికీ షాకిచ్చే విషయం.

దాన్ని తోసిరాజని ‘లెజెడ్’ను ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం ఇంకా పెద్ద షాక్. ఏ రకంగా చూసినా 2014లో ‘మనం’ ఉత్తమ చిత్రం కావాల్సిందే. అది కొత్తగా, గొప్పగా, ప్రత్యేకంగా అనిపించే సినిమా. దాన్ని కాదని ఒక మామూలు కమర్షియల్ సినిమా అయిన ‘లెజెండ్’ను బెస్ట్ పిక్చర్ అనడం ఆశ్చర్యమే.

ఉత్తమ చిత్రం మాత్రమే కాదు.. ‘లెజెండ్’కు మరో ఆరు నంది అవార్డులు రావడం షాకింగే. బాలయ్య ఉత్తమ నటుడిగా ఎంపికైతే.. ఉత్తమ దర్శకుడిగా బోయపాటి, ఉత్తమ విలన్‌గా జగపతిబాబు, ఉత్తమ నేపథ్య గాయకుడిగా విజయ్ ఏసుదాస్, ఉత్తమ మాటల రచయితగా రత్నం, ఉత్తమ ఎడిటర్‌గా కోటగిరి వెంకటేశ్వరరావు కూడా నంది అవార్డులకు ఎంపికయ్యారు. చివరికి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో రఘునాథ్ కూడా ‘లెజెండ్’ సినిమాకు గాను అవార్డుకు ఎంపికవడం విశేషం.

బాలయ్య తెలుగు దేశం ఎమ్మెల్యే. ఆయన బావ ముఖ్యమంత్రి. ఇలాంటపుడు అవార్డులకు అర్హత ఉన్నా కూడా కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంటరెస్ట్‌ను దృష్టిలో ఉంచుకుని బాలయ్య సినిమాల్ని రేసు నుంచి తప్పించడం సమంజసం. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరీ ఎక్కువ ప్రాధాన్యమిచ్చేసి బాలయ్య సినిమా మీద అవార్డుల వర్షం కురిపించేసింది. అందులోనూ ‘మనం’ లాంటి సినిమాను పక్కన పెట్టి దీనికి అన్ని అవార్డులు కట్టబెట్టడం, ముఖ్యంగా ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు