‘పద్మావతి’ని ఎవ్వ‌రూ ఆప‌లేరు: దీపికా ప‌దుకొనే

‘పద్మావతి’ని ఎవ్వ‌రూ ఆప‌లేరు: దీపికా ప‌దుకొనే

త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోన్న బాలీవుడ్ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ ’పద్మావతి‘ ని రోజుకో వివాదం చుట్టుముడుతున్న సంగ‌తి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న‌ ఆ చిత్రంలో ప‌ద్మావ‌తి పాత్రను వ‌క్రీక‌రించార‌ని రాజ్ పుత్ కర్ణి సేన స‌హా ప‌లువురు రాజ్ పుత్ వంశ‌స్థులు, ఉదయ్‌ పూర్‌ మేవార్‌ రాజవంశస్థులు, హిందూ నేత‌లు, బీజేపీ నాయ‌కులు డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు ఈ సినిమా వెనుక‌ దుబాయ్ షేకుల హ‌స్తం ఉందని బీజేపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు సుబ్ర‌మ‌ణ్య స్వామి ఆరోపించారు. ఈ నేప‌థ్యంలో ఆ వివాదాల‌పై,సినిమా విడుద‌ల‌పై `ప‌ద్మావ‌తి` టైటిల్‌ రోల్ పోషించిన దీపికా ప‌దుకొనె స్పందిచింది. ఎవ‌రెన్ని ప్ర‌య‌త్నాలు చేసినా 'ప‌ద్మావ‌తి' చిత్ర విడుద‌ల‌ను ఆప‌లేర‌ని తేల్చి చెప్పింది. అంతేకాకుండా, ఆ చిత్రంలో న‌టించినందుకు ఒక మ‌హిళ‌గా తాను చాలా గ‌ర్వ‌ప‌డుతున్నానని తెలిపింది.


రాణి ప‌ద్మావ‌తి చ‌రిత్ర‌ను ప్ర‌తి ఒక్క‌రూ తెలుసుకోవాల‌ని, అంత గొప్ప చిత్రాన్ని వివాదాల పాలు చేయ‌డం  ఘోర‌మ‌ని దీపికా చెప్పింది. సినిమా విడుద‌ల అధికారం సెన్సార్ బోర్డుకు మాత్ర‌మే ఉంద‌ని, ఈ చిత్రం త‌ప్ప‌క విడుద‌ల‌వుతుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుంద‌ని తెలిపింది. ఈ నెల‌తో తాను ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి ప‌దేళ్లు పూర్త‌య్యాయ‌ని, తాను భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో హీరోయిన్ అవుతాన‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని చెప్పింది. ఇప్ప‌టికి   భ‌న్సాలీ ద‌ర్శ‌క‌త్వంలో 3 సినిమాల్లో న‌టించాన‌ని, ఆ పాత్ర‌ల‌న్నీ ఒకేలా ఉన్నా ర‌క‌ర‌కాల హావ‌భావాలను ప్ర‌ద‌ర్శించాన‌ని తెలిపింది. ప‌ద్మావ‌తి చిత్ర విడుద‌ల‌ను ఎవ్వ‌రూ ఆప‌లేర‌ని, ఆ చిత్రం విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవుతుంద‌ని చెప్పింది. మ‌రోవైపు,  పద్మావతి చిత్ర విడుదలను నిలిపివేయాలన్న పిటిషన్ ను దేశంలోనే అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీమ్ కోర్టు తిరస్కరించిన సంగ‌తి తెలిసిందే. సినిమాల విడుద‌ల విష‌యంలో సెన్సార్ బోర్డు స్వేచ్ఛను తాము హరించబోమని సుప్రీమ్ కోర్టు స్పష్టం చేసింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English