‘మెర్శల్’కు విజయేంద్ర చేసిన సాయమేంటి?

‘మెర్శల్’కు విజయేంద్ర చేసిన సాయమేంటి?

విజయేంద్ర ప్రసాద్ 90ల్లోనే ‘బొబ్బిలి సింహం’.. ‘సమరసింహారెడ్డి’ లాంటి సూపర్ హిట్ సినిమాలకు రచయితగా పని చేశారు. కానీ వాటితో రాని పేరు.. తన కొడుకు రాజమౌళి సినిమాలకు కథ అందించడం ద్వారా సంపాదించాడాయన. గత దశాబ్దంన్నర కాలంలో రాజమౌళితో పాటుగా విజయేంద్ర కూడా ఎదిగారు. మంచి పేరు సంపాదించారు.

కానీ రాజమౌళి సినిమాలకు పని చేస్తూ.. విజయేంద్ర వేరేగా వర్క్ చేసిన సినిమాలేవీ చాలా వరకు ఆయనకు ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తన స్వీయ దర్శకత్వంలో సినిమాలు తీసినా.. వేరే వాళ్లకు కథ అందించినా అవి నిరాశనే మిగిల్చాయి. కానీ రెండేళ్ల కిందట ‘భజరంగి భాయిజాన్’ మాత్రం కథకుడిగా ఆయనకు గొప్ప ఫలితాన్నందించింది. దాని తర్వాత ఇప్పుడు ‘మెర్శల్’ సినిమాకు స్క్రీన్ ప్లే రాసి.. ఒక బ్లాక్ బస్టర్‌ను ఖాతాలో వేసుకున్నాడు.

ఐతే దర్శకుడు అట్లీ ఈ సినిమాకు ఏరి కోరి విజయేంద్ర ప్రసాద్‌తో స్క్రీన్ ప్లే రాయించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. తన తొలి రెండు సినిమాలకు సొంతంగా స్క్రీన్ ప్లే సమకూర్చుకున్న అట్లీ ఈ సినిమాకు మాత్రం విజయేంద్రను ఎందుకు సంప్రదించాడన్నది ఆసక్తికరం. ఇందుకు ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చాడు అట్లీ. మెర్శల్ కథ రాసుకున్న తర్వాత కొన్ని చోట్ల తనకు చాలా సందిగ్ధత ఏర్పడిందని.. రెండు మూడు ప్రాబబిలిటీస్ అనుకుని వాటిలో ఏది సినిమాకు సరైందో తేల్చుకోలేకపోయానని.. అలాంటి సమయంలో విజయేంద్ర ప్రసాద్ గుర్తుకొచ్చి ఆయన్ని సంప్రదించానని.. ఆయన సరైన వాటిని ఎంపిక చేసి.. చాలా చక్కగా స్క్రీన్ ప్లే సెట్ చేసి పెట్టారని అన్నాడు అట్లీ.

విజయేంద్ర ప్రసాద్ తనకు ఒక రకంగా గాడ్ ఫాదర్ అని.. ఆయనతో పని చేయడం అద్భుతమైన అనుభవమని.. ‘మెర్శల్’ ఇంత పెద్ద హిట్టవడంతో ఆయన పాత్ర కూడా కీలకమని పెద్దాయనకు క్రెడిట్ ఇచ్చాడు అట్లీ. మరోవైపు విజయేంద్ర ప్రసాద్.. అట్లీని తన మరో కొడుకుగా అభివర్ణించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English