అడ్రస్ లేని ‘ఆక్సిజన్’

అడ్రస్ లేని ‘ఆక్సిజన్’

గోపీచంద్ కొత్త సినిమా ‘ఆక్సిజన్’కు వచ్చే వారం కూడా మోక్షం కలిగేలా లేదు. ఒకటి రెండుసార్లు కాదు.. ఇప్పటికే ఐదారుసార్లు ఈ సినిమా వాయిదా పడింది. ఎప్పుడో రెండేళ్ల ముందు షూటింగ్ మొదలుపెడితే.. ఎట్టకేలకు ఈ మధ్యే సినిమాను పూర్తి చేశారు.

హీరో గోపీచంద్, దర్శకుడు జ్యోతికృష్ణల మధ్య విభేదాల వల్ల మధ్యలో ప్రొడక్షన్ ఆగిపోయి.. వార్తల్లోనే లేకుడా పోయిన ఈ సినిమాను నిర్మాత ఎ.ఎం.రత్నం ఎలాగో కష్టపడి ఇద్దరికీ సర్దిచెప్పి పూర్తి చేయించాడు. కానీ ఈ చిత్రాన్ని విడుదలకు మాత్రం సిద్ధం చేయలేకపోయారు. గత నెల చివర్లో ఆడియో వేడుక విజయవంతంగా పూర్తి కావడంతో సినిమాను ఈ నెలలో ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేసేస్తారనే అనుకున్నారు.

కానీ అక్టోబరు 27 నుంచి నవంబరు 10కి.. ఆపై 17కు వాయిదా పడిన ఈ చిత్రం వచ్చే శుక్రవారం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే సూచనలు కనిపించట్లేదు. ఆడియో వేడుక తర్వాత ఈ సినిమా గురించి దర్శక నిర్మాతలు కానీ, హీరో కానీ అస్సలు పట్టించుకోవడం లేదు. పాపం హీరోయిన్ అను ఇమ్మాన్యుయెలే ఒకసారి మీడియాలో ఈ చిత్రాన్ని ప్రమోట్ చేసి వెళ్లింది. ఆ తర్వాత ‘ఆక్సిజన్’ వార్తల్లోనే లేదు.

ఈ చిత్రాన్ని విడుదల చేయడంలో ఏం ఇబ్బందులున్నాయన్నది అర్థం కావడం లేదు. బిజినెస్ జరక్కపోవడమే కారణమని కొందరంటుంటే.. ఫైనాన్స్ సమస్యల వల్ల విడుదలకు మోక్షం కలగట్లేదని ఇంకొందరంటున్నారు. ఏదేమైనా ‘ఆరడుగుల బుల్లెట్’ తరహాలో ఇది కూడా విడుదలకే నోచుకోకుండా పోతుందేమో అని గోపీచంద్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు