స్టార్ రైటర్.. ఎన్నాళ్లీ వెయిటింగ్?

స్టార్ రైటర్.. ఎన్నాళ్లీ వెయిటింగ్?

తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడు కావడానికి ఇప్పుడు అతి దగ్గర దారి ఏది అంటే.. రైటర్ కావడమని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు. గత దశాబ్ద కాలంలో మన ఇండస్ట్రీలో రెండంకెల సంఖ్యలో రైటర్లు డైరెక్టర్లు కావడం విశేషం. రచయితగా రెండు మూడు సినిమాల అనుభవంతోనే దర్శకత్వ అవకాశం సంపాదించిన వాళ్లు చాలామందే ఉన్నారు.

కానీ దశాబ్దం కిందటే స్టార్ రైటర్‌గా పేరు తెచ్చుకుని బోలెడన్ని బ్లాక్ బస్టర్ హిట్లు ఖాతాలో వేసుకున్న గోపీమోహన్ మాత్రం ఇప్పటికీ దర్శకుడు కాలేకపోయాడు. అలాగని అతడికి ఆ ఆశ లేదా అంటే అలా ఏమీ కాదు. దర్శకుడిగా మారడానికి ఐదేళ్ల కిందటే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. సునీల్ హీరోగా ఓ సినిమా చేసేందుకు స్క్రిప్టు కూడా రెడీ చేసుకున్నాడు. కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.

ఆ తర్వాత రెండేళ్ల కిందట ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’ అంటూ తన డైరెక్టరోరియల్ డెబ్యూ మూవీకి టైటిల్ కూడా ప్రకటించాడు. కానీ ఆ సినిమా కూడా ఇప్పటిదాకా కార్యరూపం దాల్చలేదు. మధ్యలో కొన్నాల్లు రచనకు కూడా దూరమైపోయిన గోపీ.. ఎట్టకేలకు ఇప్పుడు తన దర్శకత్వ అరంగేట్రానికి సంబంధించి ఒక అప్ డేట్ ఇచ్చాడు. ఇటీవలే న్యూజెర్సీలో పర్యటించిన అతను.. దర్శకుడిగా తన తొలి సినిమాకు లొకేషన్ల ఎంపిక పూర్తయిందని చెప్పాడు.

ప్రస్తుతం నటీనటుల ఎంపిక పూర్తి కావస్తోందని.. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ సినిమా మొదలవుతుందని ప్రకటించాడు. స్క్రిప్టు కూడా ఓకే అయినట్లు వెల్లడించాడు. మరి ఇంతకుముందు ప్రకటించిన ‘ఇష్టంగా సంతోషంగా ఆనందంగా’తోనే గోపీ దర్శకుడు కాబోతున్నాడా.. కొత్త కథను ఎంచుకున్నాడా అన్నది చూడాలి. కథ ఏదైనా అతను ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా మెగా ఫోన్ పట్టేస్తే బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు