పెళ్లిచూపులు దర్శకుడి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్

పెళ్లిచూపులు దర్శకుడి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్

గత ఏడాది ‘పెళ్లిచూపులు’ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమ మొత్తం తన వైపు చూసేలా చేశాడు తరుణ్ భాస్కర్. పెద్దగా పేరు లేని నటీనటులతో.. చాలా తక్కువ బడ్జెట్లో.. ఇండస్ట్రీకి పాఠాలు నేర్పేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు తరుణ్. ఐతే మామూలుగా అంత పెద్ద హిట్టుతో దర్శకుడిగా పరిచయమైతే క్రేజీ కాంబినేషన్లో చకచకా రెండో సినిమాను మొదలుపెట్టేయాలి. కానీ తరుణ్ అలా చేయలేదు. ఏడాది పాటు ఖాళీగా ఉండిపోయాడు. ఎట్టకేలకు తన రెండో సినిమాకు రంగం సిద్ధం చేశాడు కానీ.. అందులో పేరున్న నటీనటులేమీ నటించట్లేదు. మరోసారి సింపుల్ కాస్టింగ్‌తో ముందుకెళ్లిపోతున్నాడు తరుణ్.

ఈ మధ్య దిల్ రాజు ‘వెళ్లిపోమాకే’ అనే చిన్న సినిమాను తన బేనర్ మీద రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన విశ్వక్సేన్ తరుణ్ భాస్కర్ రెండో సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఇక ‘అలియాస్ జానకి’ సినిమాతో కథానాయికగా పరిచయమై ‘రన్’.. ‘ఫ్యాషన్ డిజైనర్’.. ‘ఒక్కడు మిగిలాడు’ లాంటి సినిమాల్లో నటించిన అనీషా ఆంబ్రోస్ ఈ చిత్రంలో ఓ కథానాయికగా ఎంపికైంది. ఇందులో ఇంకో హీరోయిన్ కూడా నటిస్తుందట. ‘పెళ్లిచూపులు’ సినిమాను రిలీజ్ చేసిన సురేష్ బాబు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతుండటం విశేషం. తరుణ్ రెండో సినిమాను విక్టరీ వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో చేస్తాడని ఆయన కాకపోతే ఇంకో పేరున్న హీరోతో సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ చివరికతను చాలా మామూలు కాస్టింగ్‌తో సినిమాకు రెడీ అయిపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు