కొడుకు సినిమాపై బాబు ట్వీట్

కొడుకు సినిమాపై బాబు ట్వీట్

మంచు మనోజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఒక్కడు మిగిలాడు.. రేపే థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ మూవీలో మంచు మనోజ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. ఎల్టీటీఈ లీడర్ వేలుపిళ్లై ప్రభాకరన్ ను పోలిన పీటర్ అనే విప్లవకారుని పాత్రతో పాటు.. ఇటు కాలేజ్ స్టూడెంట్ గా మరో రోల్ చేస్తున్నాడు.

ఈ సందర్భంగా తన చిన్న కొడుకు సినిమా సూపర్ హిట్ అవాలని తండ్రి మోహన్ బాబు కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే.. ఎంతటి హిట్ అవాలని తను కోరుకుంటున్నాడో చెప్పిన విధానం మాత్రం భలేగా ఆక్టటుకుంటోంది. 20 ఏళ్ల క్రితం మోహన్ బాబు హీరోగా.. విప్లవకారుని పాత్రలో నటించిన మూవీ అడవిలో అన్న. ఆ సినిమాలో మంచు మనోజ్ కూడా ఓ పాత్రలో కనిపిస్తాడు.

అప్పుడు చిన్న కుర్రాడు అయిన మంచు మనోజ్.. తండ్రితో పాటు ఓ ఎర్రజెండా పట్టుకుని నడుస్తున్న ఫోటోను పోస్ట్ చేసిన మోహన్ బాబు.. 'అడవిలో అన్న మూవీలో నాతో కలిసి విప్లవ జెండా పట్టిన మనోజ్.. ఇప్పుడు ఒక్కడు మిగిలాడుగా మరోసారి విజయకేతనం ఎగరవేయాలని కోరుకుంటున్నా' అని ట్వీట్ చేశారు.

20 సంవత్సరాల క్రితం తన మూవీతో ఇప్పుడు సినిమాకు పోలిక తెస్తూ మోహన్ బాబు చేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక్కడు మిగిలాడు మూవీ ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ లో కూడా భారీగా విడుదల అవుతోంది.