‘గరుడవేగ’ కంటే డబ్బింగ్ సినిమా మేలు

‘గరుడవేగ’ కంటే డబ్బింగ్ సినిమా మేలు

పోయిన వారం రిలీజైన రాజశేఖర్ సినిమా ‘గరుడవేగ’కు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు బాగున్నాయి. మౌత్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అయినా ఏం లాభం.. ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలి రోజు ఆ చిత్రానికి కేవలం రూ.65 లక్షల షేర్ వచ్చింది. ఇది షాకింగ్ విషయమే. ఆ తర్వాత కొంచెం వసూళ్లు పుంజుకున్నప్పటికీ ఈ సినిమా మీద పెట్టిన భారీ పెట్టుబడికి తగ్గట్లుగ అయితే వసూళ్లు లేవు.

దీనికి ముఖ్య కారణం ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరక్కపోవడమే. ఈ చిత్రాన్ని కేవలం 300 థియేటర్లలోనే రిలీజ్ చేశారు. ఈ సినిమా స్థాయికి ఇది చాలా చిన్న నంబరే. దీనికి ఇచ్చిన థియేటర్లు కూడా అంత గొప్పవేమీ కాదు. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఈ సినిమాకు మంచి థియేటర్లు ఇవ్వలేదన్న ఆరోపణలున్నాయి.

రెండో రోజు నుంచి థియేటర్లు, షోలు పెంచినా.. అవి సరిపోలేదు. దీంతో టాక్ కు తగ్గట్లుగా వసూళ్లు రాలేదు. ఐతే గురువారం రిలీజవుతున్న డబ్బింగ్ సినిమా ‘అదిరింది’కి మాత్రం ‘గరుడవేగ’ కంటే ఎక్కువ థియేటర్లు.. అవి కూడా మంచి థియేటర్లు ఇస్తుండటం గమనార్హం. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 420 థియేటర్లలో రిలీజ్ చేస్తుండటం విశేషం. అన్ని చోట్లా పెద్ద థియేటర్లు దక్కుతున్నాయి దీనికి. ఈ చిత్రాన్ని పవన్ మిత్రుడు.. మెగా ఫ్యామిలీకి సన్నిహితుడు శరత్ మరార్ రిలీజ్ చేస్తుండటం దీనికి కలిసొస్తున్న విషయం.

దీనికి తోడు ఈ చిత్ర తమిళ వెర్షన్ అనేక వివాదాల్లో చిక్కుకోవడంతో తెలుగులోనూ దీనికి మంచి క్రేజే వచ్చింది. తమిళంతో పోలిస్తే మూడు వారాలు లేటుగా రిలీజవుతున్నప్పటికీ దీనికి క్రేజ్ కనిపిస్తోంది. కాబట్టి తొలి రోజు వసూళ్లు కూడా బాగుంటాయని ఆశిస్తున్నారు. ‘గరుడవేగ’ కంటే ఓపెనింగ్స్ ఎక్కువే వచ్చే అవకాశముంది ‘అదిరింది’కి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు