కమల్ నుంచి ఆ సినిమాలు పక్కా..

కమల్ నుంచి ఆ సినిమాలు పక్కా..

లోకనాయకుడు కమల్ హాసన్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని మరోసారి తేల్చేశారు. నిన్న తన పుట్టిన రోజు సందర్భంగా తన పార్టీకి సన్నాహాలు చేసేందుకు అభిమానులతో సమన్వయం చేసుకోవడానికి ఆయనో యాప్ కూడా ఆవిష్కరించారు. వచ్చే ఏడాది పార్టీ పెట్టబోతుున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇది కమల్ అభిమానుల్ని సంతోషపెట్టినా.. ఇకపై ఆయన నుంచి సినిమాలు రావన్న నిరాశ కూడా వారిలో కలిగింది. ఐతే తాను ఇప్పటికే రిటైరైపోయినట్లు కాదని.. తన చేతిలో ఉన్న సినిమాలన్నింటినీ పూర్తి చేశాకే రాజకీయాల్లోకి అడుగుపెడతానని ఆయన స్పష్టం చేశారు.

కమల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలున్నాయి. అవి వేర్వేరు దశల్లో ఉన్న సినిమాలు. మూడేళ్ల కిందటే షూటింగ్ పూర్తి చేసుకుని.. పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎదురు చూస్తున్న ‘విశ్వరూపం-2’ అందులో ఒకటి. కొన్ని నెలల కిందటే ఆ సినిమాను తనే టేకప్ చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కానిస్తున్నాడు కమల్. ఐతే ఆయన చెప్పిన ప్రకారమైతే ఈ ఏడాదే ఈ సినిమా రిలీజవ్వాలి. కానీ ఆలస్యమయ్యేలా ఉంది.

మరోవైపు తనకు యాక్సిడెంట్ కావడంతో మధ్యలో ఆపేసిన ‘శభాష్ నాయుడు’ను కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఇవి రెండూ కాక శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు-2’ చేయాల్సి ఉంది. ‘2.0’ విడుదల ఎప్పుడు అన్నదాన్ని బట్టి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళ్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ మూడు సినిమాల పని పట్టాక కమల్ రాజకీయాల్లోకి వెళ్తాడన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు