నేను సందీప్ కిషన్.. నేనో తెలుగువాడిని

నేను సందీప్ కిషన్.. నేనో తెలుగువాడిని

యువ కథానాయకుడు సందీప్ కిషన్ ఎమోషనల్ అయ్యాడు. తాను స్వచ్ఛమైన తెలుగువాడనని.. కానీ తనను పరాయివాడిలాగా చూస్తున్నారని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మధ్య తాను కొన్ని తమిళ సినిమాలు చేయడంతో.. తాను తెలుగు సినిమాలకు దూరమైపోయినట్లు భావిస్తున్నారని.. తన కొత్త సినిమా ‘కేరాఫ్ సూర్య’ను తమిళ డబ్బింగ్ సినిమా అంటుండటం బాధ కలిగిస్తోందని సందీప్ ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇది తెలుగు సినిమా అని.. తెలుగు నుంచి తమిళంలోకి డబ్ అవుతోందని.. అంతే తప్ప తమిళం నుంచి తెలుగులోకి రావట్లేదని స్పష్టం చేశాడు సందీప్. నిజంగా ఇది డబ్బింగ్ సినిమా అయితే.. అలా చెప్పడానికి తనకు ఇబ్బందేమీ లేదని.. ‘నగరం’ సినిమాను ద్విభాషా చిత్రం అని నిర్మాత చెప్పమన్నా తాను చెప్పలేదని.. డబ్బింగ్ సినిమా అనే చెప్పానని అన్నాడు సందీప్. ‘కేరాఫ్ సూర్యను’ రెండు భాషల్లో ఒకేసారి తీశామని.. ప్రధానంగా ఇది తెలుగులో చేసిన సినిమా అని అన్నాడు.

తమిళ హీరోలు తెలుగులోకి వచ్చి ఇక్కడ మార్కెట్ సంపాదించుకుంటున్నారని.. వారిని మన ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారని.. అలాగే మనం కూడా పొరుగు భాషల్లో మార్కెట్ సంపాదించుకోవాలని తన లాంటి హీరోలు ప్రయత్నిస్తున్నారని.. ద్విభాషా చిత్రాలు చేస్తున్నారని.. అలాంటపుడు దాన్ని మరోలా చూడకూడదని అన్నాడు సందీప్. ‘కేరాఫ్ సూర్య’ను డబ్బింగ్ సినిమా అనొద్దని, ఇది అచ్చమైన తెలుగు సినిమా అని చెప్పాడు సందీప్. కూకట్ పల్లిలోని మల్లికార్జున థియేటర్‌ను ‘కేరాఫ్ సూర్య’కు కేటాయించడం మీద ‘ఒక్కడు మిగిలాడు’ టీం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. దీన్నో డబ్బింగ్ సినిమాగా పేర్కొన్న నేపథ్యంలో హర్టయి సందీప్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు