మళ్లీ ఏడిపించేసిన రాజశేఖర్

మళ్లీ ఏడిపించేసిన రాజశేఖర్

‘గరుడవేగ’ ప్రి రిలీజ్ ఈవెంట్లో హీరో రాజశేఖర్ కొన్ని రోజుల కిందటే చనిపోయిన తన తల్లిని తలుచుకుని బోరుమని ఏడ్చేయడం అందరినీ కలచివేసిన సంగతి తెలిసిందే. ఆయన ఆవేదన చాలా జెన్యూన్‌గా అనిపించడంతో అందరూ అయ్యో పాపం అనుకున్నారు. తాజాగా ‘గరుడవేగ’ సక్సెస్ మీట్లోనూ రాజశేఖర్ తన తల్లిని.. బావమరిది మురళిని తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. ఆయన మరోమారు ఉద్వేగాన్ని ఆపుకోలేక ఏడ్చేశాడు. రాజశేఖర్ తల్లి చనిపోయిన కొన్ని రోజులకే.. ‘గరుడవేగ’ రిలీజ్‌కు రెండు రోజుల ముందు జీవిత సోదరుడు మురళి కూడా అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ వాళ్లను తలుచుకుని ఉద్వేగానికి గురయ్యాడు.

ముందు చాలా సరదాగా ప్రసంగాన్ని మొదలుపెట్టి.. జోకులు పేల్చుతూ నవ్వించాడు రాజశేఖర్. ఐతే అందరి గురించి మాట్లాడటం అయిపోయాక రాజశేఖర్.. తన తల్లి, బావమరదుల ప్రస్తావన తెచ్చాడు. ఈ రోజు తాను ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నీళ్లు పెట్టుకోకూడదనుకుని వచ్చానని.. కానీ స్టేజ్ మీద తన తల్లి, బావమరదుల ఫొటోలు చూడగానే తట్టుకోలేకపోయానని అన్నాడు రాజశేఖర్.

ఎంబీబీఎస్ డాక్టర్ అయిన తాను.. ఆల్టర్నేట్ థెరపీలన్నీ చదివి తనకు మించిన పుడింగి లేదన్నట్లు అనుకునేవాడని.. కానీ తన తల్లి, బావమరిది తనను ప్రశ్నిస్తున్నట్లుగా వెళ్లిపోయారని.. కర్మ అనేది ఒకటుంటుందని.. దాన్ని ఎవరూ ఆపలేరని అర్థమైందని రాజశేఖర్ అన్నాడు. తాను వందేళ్ల పాటు తన తల్లిని బతికించుకుందామనుకున్నానని.. కానీ ఆమె వెళ్లిపోయిందని చెబుతూ రాజశేఖర్ ఏడ్చేశాడు.

తన బావమరిదికి తానంటే ప్రాణమని.. ఎక్కడికి వెళ్లినా తనకు ఏం కావాలో చూసుకునేవాడని.. కానీ మంచి స్థాయికి వచ్చిన సమయంలో అతను ఇలా వెళ్లిపోవడం బాధాకరమని అన్నాడు. ‘గరుడవేగ’ విడుదలకు ముందు ఇలా వాళ్లిద్దరూ వెళ్లిపోవడంతో.. తనకు అన్నీ చెడే జరుగుతున్నాయని.. కాబట్టి సినిమా కూడా ఆడదేమో అనుకున్నానని.. కానీ దేవుడి దయ వల్ల సినిమా ఆడిందని అన్నాడు రాజశేఖర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు