‘ఖాకి’ సినిమా అలా పుట్టింది

‘ఖాకి’ సినిమా అలా పుట్టింది

‘ఆవారా’.. ‘నా పేరు శివ’ లాంటి సినిమాలతో తెలుగులో ఒకప్పుడు మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు కార్తి. కానీ ఆ తర్వాత తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన అతడి సినిమాలు వరుసగా బోల్తా కొట్టడంతో మార్కెట్ దెబ్బ తింది. గత ఏడాది ‘ఊపిరి’ సినిమాతో మళ్లీ ఇక్కడ గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తి. ఇప్పుడతను ‘ఖాకి’ సినిమాతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా కొంచెం గట్టిగానే ప్రమోట్ చేస్తున్నాడు కార్తి.

ఈ సినిమా ప్రోమోలు కూడా ఆసక్తి రేకెత్తించాయి. ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా అని.. పోస్టర్ మీదే వేసిన సంగతి తెలిసిందే. ఇంతకీ ఆ వాస్తవ సంఘటనలు ఏంటి అన్నది ఓ ఇంటర్వ్యూలో కార్తి వెల్లడించాడు.

‘‘నేను ఇంతకుముందు ‘విక్రమార్కుడు’ తమిళ వెర్షన్లో నటించాను. అందులో పోలీస్ క్యారెక్టర్ చేయడం కోసం ఓ పోలీస్ అధికారిని కలిసి ఆయన కెరీర్లో ఎదురైన కొన్ని వాస్తవ సంఘటనలు చెప్పమన్నాను. ఆయన ఒక ఛాలెంజింగ్‌ కేసు గురించి చెప్పారు. ఆ కేసును పరిష్కరించడానికి పదేళ్లు పట్టిందట. ఓ ప్రాంతంలో వరుస హత్యలు జరగ్గా.. చిన్న క్లూ కూడా దొరకలేదట. ఐతే ఒక చిన్న టీంతో ఏళ్ల తరబడి ప్రయత్నం చేసి ఆ కేసును ఆయన ఛేదించినట్లు చెప్పారు.

తర్వాత కొన్నేళ్లకు దర్శకుడు వినోద్‌ నా దగ్గరకు వచ్చి ఓ రియల్ స్టోరీ చెప్పాడు. అతను చెప్పింది కూడా ఈ కేసు గురించే. నాకు ఈ కథ ముందే తెలుసని చెప్పాను. ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకున్నాను. ఈ సినిమాను దేంతోనూ పోల్చలేం. డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు ఈ సినిమాతో ఏ సినిమాతోనైనా పోల్చవచ్చా అని చెక్‌ చేసుకున్నా. పోలికకు అవకాశమే లేదు. ఈ నెల 17న ఆ సంగతి ప్రేక్షకులు కూడా ఒప్పుకుంటారు’’ అని కార్తి ధీమాగా చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు