బాక్సాఫీస్‌పై అరవ దాడి!

బాక్సాఫీస్‌పై అరవ దాడి!

డిసెంబర్‌ నుంచి మళ్లీ పెద్ద చిత్రాల తాకిడి వుండడంతో చాలా మంది చిన్న చిత్రాల నిర్మాతలు, అనువాద చిత్రాలని కొన్న వాళ్లు ఈ నెలలోనే అదృష్టం పరీక్షించుకుంటున్నారు. గత వారం మూడు కొత్త సినిమాలు విడుదల కాగా, ఈ వారంలో అయిదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అయితే ఈవారం రాబోతున్న సినిమాల్లో మంచు మనోజ్‌ నటించిన 'ఒక్కడు మిగిలాడు' తప్ప మిగతావన్నీ అనువాద చిత్రాలే కావడం విశేషం.

తమిళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన మెర్సల్‌ తెలుగులో ఈ వారం రిలీజ్‌ అవుతోంది. అన్నిటికంటే ముందుగా గురువారం నాడు 'అదిరింది' విడుదల కానుంది. ఇక శుక్రవారం వచ్చే సందీప్‌ కిషన్‌ సినిమా 'కేరాఫ్‌ సూర్య'ని ద్విభాషా చిత్రంగా చెబుతున్నారు కానీ టెక్నికల్‌గా ఇది డబ్బింగ్‌ సినిమానే.

అదే రోజు రాబోతున్న సిద్ధార్థ్‌ 'గృహం' ఇప్పటికే తమిళంలో విడుదలై మంచి టాక్‌ తెచ్చుకుంది. హారర్‌ని కలుషితం చేస్తోన్న కామెడీ సినిమాల మధ్య అచ్చమైన హారర్‌ సినిమాగా దీనికి పేరొచ్చింది. ఇక విశాల్‌ 'డిటెక్టివ్‌' కూడా సెప్టెంబర్‌లో తమిళంలో విడుదలై మంచి టాక్‌ సొంతం చేసుకుంది. ఇన్ని సినిమాలు ఒకేసారి విడుదల కావడం, మార్కెట్లో ఆల్రెడీ మూడు, నాలుగు సినిమాలు వుండడంతో థియేటర్ల కొరత ఏర్పడింది.

మరో నాలుగు రోజుల్లో రిలీజ్‌ వున్నా వీటిలో చాలా చిత్రాలకి సిటీల్లో కూడా థియేటర్లు కన్‌ఫర్మ్‌ కాలేదు. ఇన్నిటి మధ్య ఏది ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంటుందో, ఏవి గుంపులో గోవిందా అయిపోతాయో శుక్రవారానికి గానీ తెలీదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English