స్పైడర్‌ దెబ్బకి దిల్‌ రాజు బెంబేలు!

స్పైడర్‌ దెబ్బకి దిల్‌ రాజు బెంబేలు!

నైజాం ఏరియాలో టాప్‌ డిస్ట్రిబ్యూటర్‌గా ఇరవయ్యేళ్లుగా కొనసాగుతోన్న దిల్‌ రాజు నిర్మాతగా బిజీ అయినప్పటికీ పంపిణీ రంగానికి దూరం కాలేదు. ఇప్పటికీ నైజాంలో ఏ పెద్ద సినిమా అయినా దిల్‌ రాజుని దాటి వేరే పంపిణీదారులకి వెళ్లాలి. అయితే ఈమధ్య కాలంలో పెద్ద చిత్రాలకి రేట్లు గణనీయంగా పెంచేసారు. క్రేజ్‌ వున్న సినిమాలకి భారీ రేట్లు చెబుతున్నారు.

హక్కులు తీసుకోవాలంటే ఖచ్చితంగా అంత చెల్లించాల్సి రావడంతో దిల్‌ రాజు అయిష్టంగానే కొన్ని పెద్ద సినిమాలపై భారీగా వెచ్చించాడు. స్పైడర్‌ చిత్రానికి దిల్‌ రాజు ఇరవై రెండు కోట్లు అచ్చంగా ఇచ్చాడు. కానీ దీనికి తిరిగి పది కోట్ల షేర్‌ కూడా రాలేదు. అలాగే జై లవకుశ చిత్రాన్ని పద్ధెనిమిది కోట్లకి కొంటే రెండు నుంచి మూడు కోట్ల వరకు నష్టం వచ్చింది. ఫిదా చిత్రంపై భారీ లాభాలు గడించిన దిల్‌ రాజుకి ఆ లాభం మొత్తం ఈ రెండు సినిమాలతో ఊడ్చిపెట్టుకుపోయింది.

ముఖ్యంగా స్పైడర్‌ మిగిల్చిన నష్టంతో దిల్‌ రాజు బాగా డిజప్పాయింట్‌ అయ్యాడట. పంపిణీ వ్యవస్థ మరీ గ్యాంబ్లింగ్‌ మాదిరిగా తయారైందని, ఇకపై పెద్ద చిత్రాల పంపిణీకి దూరంగా వుంటానని సన్నిహితులతో అంటున్నాడట. ఇప్పటికే దిల్‌ రాజు, ఏషియన్‌ సినిమాస్‌ తప్ప నైజాంలో పెద్ద పంపిణీదారులు ఎవరూ లేరు.

దిల్‌ రాజు కూడా తప్పుకున్నట్టయితే నైజాం హక్కుల ధరలు అమాంతం పడిపోతాయి. మరి నిర్మాతలంతా కలిసి దిల్‌ రాజుని కన్విన్స్‌ చేసుకుంటారో లేక మరో మధ్యేమార్గం వెతుకుతారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు