'రంగస్థలం' పై మంచు మ‌నోజ్ వైర‌ల్ ట్వీట్‌!

'రంగస్థలం' పై మంచు మ‌నోజ్ వైర‌ల్ ట్వీట్‌!

గ‌తంలో కొంద‌రు టాలీవుడ్  హీరోల మ‌ధ్య అభిప్రాయభేదాలు, ఈగోలు ఉండేవి. ఒక‌వేళ కొంద‌రు హీరోల మధ్య సాన్నిహిత్యం ఉన్నా....ఒక‌రి సినిమాల గురించి ఒక‌రు మాట్లాడుకోవ‌డం చాలా అరుదుగా జ‌రిగేది. ఒక‌వేళ మాట్లాడినా ఏదో ముక్త‌స‌రిగా ఆ సినిమా విజ‌యం సాధించాల‌ని కోరుకునే వారు. అయితే, టాలీవుడ్ లో కొంత‌కాలంగా ఆ ట్రెండ్ మారుతూ వ‌స్తోంది. యువ హీరోలు త‌మ మ‌ధ్య భేష‌జాలు వీడి ఒకరి సినిమాల‌ను మ‌రొక‌రు అభినందించుకోవ‌డం, వారి పెర్ ఫార్మ‌న్స్ పై ప్ర‌శంస‌లు కురిపించ‌డం వంటి ప‌రిణామాలు జరుగుతున్నాయి.

ఇటీవ‌ల ఎన్టీఆర్ చిత్రం ప్రారంభోత్స‌వానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. తాజాగా, రామ్ చ‌ర‌ణ్ ను త‌న సోద‌రుడిగా పేర్కొంటూ హీరో మంచు మ‌నోజ్ ఓ ట్వీట్ చేశాడు. చెర్రీ న‌టిస్తున్న రంగ‌స్థ‌లం సినిమా చూసేందుకు తాను చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నాన‌ని పోస్ట్ చేశాడు. ప్ర‌స్తుతం ఆ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.విల‌క్ష‌ణ ద‌ర్శ‌కుడు సుకుమార్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ల కాంబోలో తెర‌కెక్కుతున్న రంగ‌స్థలం చిత్రంపై భారీ అంచ‌నాలున్న సంగ‌తి తెలిసిందే.  1985 నాటి గ్రామీణ వాతావరణం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వ‌చ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుద‌ల కానుంది. అయితే, ఈ సినిమా పై  మంచు మనోజ్ ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశాడు. తాను ఆ సినిమా పాట‌ల‌ను విన్న‌ప్ప‌టినుంచి ఆగ‌లేక‌పోతున్నాన‌ని, వెంట‌నే సినిమాను విడుద‌ల చేయాల‌ని కోరాడు. 

"నా సోదరుడు రామ్ చరణ్ 'రంగస్థలం' పాటలు వినిపించినప్పటి నుంచి... అవి నన్ను వెంటాడుతున్నాయి. ఆడియో, సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేయలేకపోతున్నా. వెంటనే విడుదల చేయండి" అంటూ మ‌నోజ్ ట్వీట్ చేశాడు. మనోజ్ ద్విపాత్రాభిన‌యం చేసిన‌ 'ఒక్కడు మిగిలాడు' సినిమా ఈనెల 10వ తేదీన విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో మ‌నోజ్...ఎల్టీటీఈ చీఫ్‌ ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో, విద్యార్థి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English