ఔను.. సినిమాలు మానేద్దామనుుకున్నా-మనోజ్

ఔను.. సినిమాలు మానేద్దామనుుకున్నా-మనోజ్

కొన్ని నెలల కిందట తాను సినిమాలు మానేస్తున్నానని.. ‘ఒక్కడు మిగిలాడు’నే తన చివరి సినిమా అని మంచు మనోజ్ చేసిన ట్వీట్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఐతే అలాంటిదేమీ లేదని తర్వాత తేల్చేశాడు మనోజ్. ఐతే అప్పుడా ట్వీట్ పెట్టడానికి కారణమేంటో మనోజ్ ఇప్పుడు వివరించాడు. తాను అప్పుడు సినిమాలు మానేద్దామనుకున్న మాట వాస్తవమే అన్నాడు.

తనలో అప్పుడు అంత ఎమోషన్ రావడానికి ‘ఒక్కడు మిగిలాడు’ సినిమానే కారణమని మనోజ్ చెప్పాడు. ఈ సినిమా కోసం చేసిన పరిశోధనలో భాగంగా శ్రీలంకలో తమిళుల కష్టాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, పేపర్ క్లిప్పింగ్స్ తనకు ఇచ్చారని.. అవన్నీ చూసి కదిలిపోయానని మనోజ్ తెలిపాడు. అదే సమయంలో మన చుట్టూ ఏం జరుగుతోందో చూద్దామని చూస్తే.. పెద్దోళ్లు చిన్నోళ్లను తొక్కేస్తున్నారని.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారని అర్థమైందని.. అందుకే సినిమాలు వదిలేసి పూర్తిగా జనాల్లోకి వెళ్లిపోవాలని తాను నిర్ణయించుకున్నట్లు మనోజ్ తెలిపాడు.

వీలైతే ఎదుటి వాడికి సాయం చేయి.. ఎవరి కడుపూ కొట్టకు అని తన తండ్రి తనకు చిన్నప్పట్నుంచి చెబుతుండే వారని.. ఆ మాటనే తాను పాటిస్తున్నానని.. తన వంతుగా తన చుట్టూ ఉన్న వాళ్లను చదివిస్తున్నానని.. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయంలో పది శాతం రైతులకు ఇస్తున్నానని.. అయినప్పటికీ ఇది సరిపోదని.. తాను పూర్తిగా జనాల్లోకి వెళ్లాలని అనుకుని ఆ రోజు అలా ట్వీట్ పెట్టానని మనోజ్ వివరించాడు.

తానేంటో తన తండ్రికి తెలుసు కాబట్టి ఈ విషయంలో ఏమీ అనలేదని.. కానీ తన అన్న విష్ణు మాత్రం ఒక తన్ను తన్ని ఏంట్రా నీ సొంత నిర్ణయాలు అంటూ తిట్టాడని చెప్పాడు. దేనికైనా టైం రావాలని.. అప్పుడు చేయొచ్చని.. ఈలోపు సినిమాలు చేస్తూ.. దాని ద్వారా వచ్చే ఆదాయంతో సేవా కార్యక్రమాలు చేయమని చెప్పినట్లు మనోజ్ తెలిపాడు. దీంతో తాను నిర్ణయం మార్చుకున్నట్లు మనోజ్ వెల్లడించాడు. ఐతే ఏదో ఒక రోజు తాను పూర్తిగా సర్వీస్ లోకి దిగడం ఖాయమని.. ఆ రోజు అందరి లెక్కలు తీస్తానని. సినిమా పరిశ్రమలో చిన్నోళ్లను తొక్కుతున్న పెద్దోళ్లను ప్రశ్నిస్తానని.. వారి నుంచి సమాధానాలు కక్కిస్తానని.. అందరి తాట తీస్తానని మనోజ్ హెచ్చరికలు జారీ చేయడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు