ఇదేం పబ్లిసిటీ బాబులూ..

ఇదేం పబ్లిసిటీ బాబులూ..

సినిమా పబ్లిసిటీ అనేది రోజు రోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల వసూళ్లు వీకెండ్‌కు పరిమితం అయిపోతున్న నేపథ్యంలో విడుదలకు ముందు సాధ్యమైనంత ఎక్కువగా హైప్ తీసుకురావడం కోసం హడావుడి చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఏంజెల్’ టీం కూడా ఇలాగే ఓ విభిన్నమైన ప్రయత్నం చేసింది.

ఈ సినిమా హిందీ శాటిలైట్ బిజినెస్ రూ.1.4 కోట్లకు జరిగిందంటూ పోస్టర్ల మీద వేసి పబ్లిసిటీ చేస్తోంది. ఇలాంటి పబ్లిసిటీ ఇంతకుముందెన్నడూ చూడనిది. పోస్టర్ల మీద బిజినెస్ వివరాలు వేయడమే చూసి ఉండం. అలాంటిది హిందీ శాటిలైట్ హక్కులు రూ.1.4 కోట్లు పలికాయంటూ పోస్టర్ మీద వేయడం మరీ విడ్డూరం. ఇది చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయి థియేటర్లకు వచ్చేస్తారని చిత్ర బృందం నమ్మకమేమో.

గత కొన్నేళ్లలో తెలుగు సినిమాల హిందీ శాటిలైట్ మార్కెట్ బాగా పుంజుకున్న మాట వాస్తవమే. మన దగ్గర అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాల్ని డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తుంటే కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. మంచి ఆదాయం వస్తోంది. అలాగే హిందీ ఛానెళ్లు మన సినిమాల డబ్బింగ్ హక్కులకు మంచి రేటు ఇచ్చి తీసుకుంటున్నాయి. ‘సోనీ మ్యాక్స్’ లాంటి ఛానెళ్లు సౌత్ సినిమాల డబ్బింగ్ వెర్షన్లతోనే నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రాఫిక్స్ ప్రధానంగా సాగే ‘ఏంజెల్’ సినిమాకు రూ.1.4 కోట్లు పలికి ఉంటే ఆశ్చర్యపోవాల్సిన పని ఏమీ లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు