రసం పిండుతున్న దిల్ రాజు

రసం పిండుతున్న దిల్ రాజు

‘రాజా ది గ్రేట్’ సినిమా తొలి వారంలో అంచనాల్ని మించి పెర్ఫామ్ చేసింది. రూ.25 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ సాధించి తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన రవితేజ సినిమాగా నిలిచింది. కానీ ఆ తర్వాత సినిమా డౌన్ అయింది. రెండో వారంలో ‘ఉన్నది ఒకటే జిందగీ’ విడుదలవడంతో దీనికి నామమాత్రపు వసూళ్లు వచ్చాయి. ఐతే ఆ సినిమా వీకెండ్ తర్వాత వీక్ అవడంతో ‘రాజా ది గ్రేట్’ ఓ మోస్తరు వసూళ్లతో సాగుతోంది. ఈ చిత్రం ఇప్పటిదాకా రూ.29 కోట్ల దాకా షేర్ రాబట్టింది. ఐతే దీని థియేట్రికల్ హక్కుల్ని రూ.32 కోట్లకు అమ్మాడు దిల్ రాజు. అంటే ఇంకో మూడు కోట్ల షేర్ రాబడితేనే దీన్ని హిట్ అనొచ్చన్నమాట.

ఐతే దిల్ రాజు ఈ విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. ఈ వారం మూడు కొత్త సినిమాలు రిలీజవుతున్నా సరే.. ‘రాజా ది గ్రేట్’ థియేటర్లను ఖాళీ చేయట్లేదు. కొన్ని స్క్రీన్లు మాత్రమే తీసేసి.. మెజారిటీ థియేటర్లలో దాన్ని అలాగే నడిపిస్తున్నాడు. ముఖ్యంగా తనకు థియేటర్లున్న నైజాం, వైజాగ్ ఏరియాల విషయంలో పట్టుదలతో ఉన్నాడు రాజు. ఈ ఏరియాల్లో ‘రాజా ది గ్రేట్’ అంచనాల్ని మించి వసూళ్లు రాబట్టింది. ఈ వీకెండ్లో కూడా ఈ ఏరియాల్లో సాధ్యమైనన్ని వసూళ్లు రాబట్టాలని దిల్ రాజు ఆశిస్తున్నాడు. ఇందుకోసం ‘రాజా ది గ్రేట్’ నిడివి పెరుగుతుందని.. ఎడిటింగ్‌లో తీసేసిన కొన్ని కామెడీ సీన్లను కలుపుతున్నారు. ఈ ఎత్తుగడ ఇంకొంతమంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి ‘రాజా ది గ్రేట్’ నుంచి చివరి వరకు ఎంత వీలైతే అంత రసం తీయడానికి దిల్ రాజు గట్టిగానే ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి రూ.32 కోట్ల షేర్ మార్కును దాటించి.. ఈ సినిమా కూడా ‘సిక్సర్’ అని రుజువు చేయాలని రాజు పట్టుదలతో ఉన్నట్లున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు