బాలీవుడ్.. బతికిపోయింది

బాలీవుడ్.. బతికిపోయింది

ఓవైపు ‘బాహుబలి: ది కంక్లూజన్’ హిందీ ప్రేక్షకుల్ని కూడా ఉర్రూతలూగిస్తూ.. ఉత్తరాదిన కూడా ప్రభంజనం సృష్టిస్తుంటే.. మరోవైపు దానికి ముందు, వెనుక వచ్చిన బాలీవుడ్ పెద్ద సినిమాలన్నీ బోల్తా కొట్టేశాయి. అలవోకగా వందల కోట్ల వసూళ్లు సాధించే బాలీవుడ్ సినిమాలు ఈ ఏడాది ప్రథమార్ధంలో దారుణమైన ఫలితాలు చవిచూశాయి. ‘బాహుబలి-2’ వసూళ్లను మించేస్తాయని ఆశలు పెట్టుకున్న సినిమాలన్నీ దాని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయాయి. సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ లాంటి బడా స్టార్లు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశారు.

ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన షారుఖ్ మూవీ ‘రయీస్’ ఫ్లాప్ అయింది. ఆ తర్వాత వేసవి చివర్లో ‘జబ్ హ్యారీ మెట్ సెజాల్’తో పలకరించాడు షారుఖ్. ఈ సినిమా షారుఖ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. ఇక సల్మాన్ ఖాన్ సినిమా ‘ట్యూబ్ లైట్’ కూడా ఇలాంటి ఫలితాన్నే చవిచూసింది. హృతిక్ రోషన్ మూవీ ‘కాబిల్’ కూడా పెద్దగా ఆడింది లేదు. ‘రాబ్తా’ లాంటి భారీ అంచనాలున్న సినిమా కూడా బోల్తా కొట్టేసింది. ఇంకా కొన్ని పెద్ద సినిమాలకు కూడా చేదు అనుభవాలే మిగిలాయి. మొత్తంగా ఈ ఏడాది ప్రథమార్ధంలో బాలీవుడ్‌ తీవ్ర నిరాశలో మునిగిపోయింది.

కానీ ద్వితీయార్ధం మాత్రం బాలీవుడ్‌కు ఆశాజనకంగానే కనిపిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య రిలీజైన కొన్ని పెద్ద సినిమాలు మంచి వసూళ్లు సాధించాయి. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా రిలీజైన అక్షయ్ కుమార్ సినిమా ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’ మంచి విజయం సాధించింది. మంచి సినిమాగా పేరు తెచ్చుకోవడమే కాక రూ.150 కోట్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఇక దసరా కానుకగా రిలీజైన వరుణ్ ధావన్ మూవీ ‘జుడ్వా-2’ కూడా మంచి ఫలితాన్నే అందుకుంది. ఆ చిత్రం రూ.200 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

ఇక తాజాగా దీపావళికి విడుదలైన రోహిత్ శెట్టి సినిమా ‘గోల్ మాల్ అగైన్’ ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈచిత్రం రూ.250 కోట్ల మార్కును టచ్ చేసింది. ఈ ఏడాది చివర్లో రాబోతున్న ‘పద్మావతి’ మీద భారీ అంచనాలున్నాయి. అది ‘బాహుబలి’కి దీటైన సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. అది అంచనాల్ని అందుకోగలిగితే.. కొంచెం సంతృప్తిగా ఏడాదిని ముగిస్తుంది బాలీవుడ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు