‘రంగస్థలం’ అలా ఫిక్సయింది

‘రంగస్థలం’ అలా ఫిక్సయింది

సంక్రాంతికి వద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ సినిమా ‘అజ్నాతవాసి’ వచ్చి అడ్డం పడింది. ఏప్రిల్లో డేట్ చూసుకుందామని అనుకుంటే ఓవైపు తెలుగులోనే భారీ సినిమాలు పోటీకి దిగుతున్నాయి. పైగా ‘2.0’ కూడా అదే నెలకు వాయిదా పడ్డట్లు వార్తలొస్తున్నాయి. వేసవి దగ్గర పడే సమయానికి ఇంకా ఎన్నెన్ని మార్పులుంటాయో తెలియదు.

ఏప్రిల్ కాదనుకుంటే.. అలా అలా వెనక్కి వెళ్తూ ఉండాలి. అందుకే ‘రంగస్థలం’ టీం ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వేసవి సీజన్ ఆరంభంలోనే రిలీజ్ చేసేయాలని ఫిక్సయినట్లు సమాచారం. మార్చి 29న సినిమాను విడుదల చేసేందుకు ముహూర్తం చూసుకున్నట్లు తెలుస్తోంది.

మామూలుగా వేసవిలో మార్చి నెలాఖరుకే సినిమాల సందడి మొదలైపోతుంది. ఆ నెలాఖరుకే ఇంటర్మీడియట్ విద్యార్థులు ఫ్రీ అయిపోతుంటారు. ఏప్రిల్లో ఎలాగూ తీవ్రమైన పోటీ ఉంది కాబట్టి మార్చి నెలాఖరు అయితే సోలో బ్యాటింగ్‌కు దిగొచ్చని భావిస్తోంది ‘రంగస్థలం’ టీం.

సంక్రాంతికే అనుకున్న సినిమాను మరీ ఎక్కువ ఆలస్యం చేస్తే నిర్మాతలకు ఫైనాన్స్ వడ్డీలు తడిసిమోపెడవుతాయి. మార్చి 29కి ఫిక్సయితే.. ఒకవేళ ఏప్రిల్ 13న ‘2.0’ వచ్చినా ఇబ్బంది లేదు. రెండు వారాల పాటు మంచి రన్ ఉంటే సినిమా లాభాల బాట పట్టేస్తుంది. కాబట్టి ఈ డేటుకే ‘రంగస్థలం’ దాదాపుగా ఫిక్సయినట్లే అంటున్నాయి చిత్ర వర్గాలు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు