రాజశేఖర్ చిరు ఇంటికెళ్తే..

రాజశేఖర్ చిరు ఇంటికెళ్తే..

మెగాస్టార్ చిరంజీవికి.. ఆయన తరం సీనియర్ హీరో రాజశేఖర్‌కు మధ్య ఒక సమయంలో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. తమిళ హిట్ మూవీ ‘రమణ’ను తాను రీమేక్ చేయాలని భావిస్తే.. దాన్ని చిరంజీవి లాగేసుకున్నారంటూ రాజశేఖర్ అప్పట్లో అసహనం వ్యక్తం చేయడం గుర్తుండే ఉంటుంది.

ఇంకో సందర్భంగా చిరు మీద విమర్శలు చేసినందుకు మెగా అభిమానులు రాజశేఖర్ ఫ్యామిలీ మీద దాడికి ప్రయత్నించడం.. చిరు స్వయంగా వాళ్లింటికెళ్లి సారీ చెప్పడం గుర్తుండే ఉంటుంది. పవన్ కళ్యాణ్‌తో సైతం రాజశేఖర్, జీవితలకు కొంత అంతరం ఉంది. ‘గబ్బర్ సింగ్’లో రాజశేఖర్ మీద పవన్ పంచులేయడం ఈ అంతరానికి సూచికే.

ఈ నేపథ్యంలో తాజాగా రాజశేఖర్.. చిరంజీవి ఇంటికి వెళ్లానని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తన కొత్త సినిమా ‘గరుడవేగ’ చూడమంటూ చిరును అడిగినట్లు రాజశేఖర్ వెల్లడించాడు. ‘‘అవును. నేను చిరంజీవి గారి ఇంటికి వెళ్లా. నా సినిమా చూడమని ఆహ్వానించా. ఆయన అప్పటికే ‘గరుడవేగ’ ట్రైలర్‌ చూశారట. ‘మా ఆఫీసులోనూ నీ సినిమా గురించి మాట్లాడుకొంటున్నారు. నేనూ ట్రైలర్‌ చూశా. బాగుంది’ అని చిరంజీవి గారు మెచ్చుకున్నారు కూడా’’ అని రాజశేఖర్ చెప్పాడు.

మెగా అభిమానుల్లో తనపై వ్యతిరేకత తగ్గించుకోవడానికి.. వాళ్లను కూడా తన సినిమా వైపు మళ్లించడానికి రాజశేఖర్ ఈ మాట అన్నట్లుంది. మరి నిజంగానే చిరంజీవి ‘గరుడవేగ’ చూస్తారేమో వెయిట్ చేయాలి. అదే జరిగితే ‘గరుడవేగ’ ప్రచారానికది బాగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు