రవితేజ కూడా హ్యాండిచ్చాడు

రవితేజ కూడా హ్యాండిచ్చాడు

తమిళంలో హిట్‌ అయిన 'తని ఒరువన్‌' తర్వాత జయం రవి, అరవింద్‌ స్వామి కాంబినేషన్‌లో వచ్చిన 'బోగన్‌' కూడా సక్సెస్‌ అయింది. అయితే 'తని ఒరువన్‌'ని 'ధృవ'గా తెలుగులోకి రీమేక్‌ చేసారు కానీ 'బోగన్‌' రీమేక్‌ మాత్రం చేతులు మారుతోంది. ముందుగా ఈ రీమేక్‌లో సునీల్‌ చేద్దామని అనుకున్నాడు. అయితే కమర్షియల్‌ హీరోగా నిలబడడానికి చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టడంతో సునీల్‌ ఈ ప్రాజెక్ట్‌ వదిలేసుకున్నాడు.

దాంతో ఆ నిర్మాతలు రవితేజ దగ్గరకి వెళ్లారు. బోగన్‌ రీమేక్‌ చేసేందుకు రవితేజ ఆసక్తి చూపించాడు. అయితే తెలుగులో కూడా అరవింద్‌ స్వామి క్యారెక్టర్‌ని అతనితోనే చేయించాలని కండిషన్‌ పెట్టాడట. అయితే అరవింద్‌ స్వామి ధృవలో నటించడానికే చాలా పారితోషికం అడిగాడు. ఈ నిర్మాతలు అరవింద్‌ స్వామి డేట్స్‌ సాధించలేకపోవడంతో రవితేజ కూడా హ్యాండ్‌ ఇచ్చేసాడని, మరోసారి హీరో కోసం అన్వేషణ మొదలైందని సమాచారం.

తెలుగులో ఈ చిత్రం రీమేక్‌ అవుతుందా, అయితే అది ఎవరితో అవుతుందనేది చూడాలి. రవితేజ ఇకపై చేసే సినిమాల్లో వెరైటీ వుండాలని ఖచ్చితంగా చెబుతున్నాడట. తన పాత్ర పరంగా కొత్తదనం లేకపోతే నటించేది లేదని ఈమధ్య చాలానే కథలు రిజెక్ట్‌ చేసాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు