దిల్ రాజు 20 ఏళ్లలో ఇలాంటిది చూడలేదట

దిల్ రాజు 20 ఏళ్లలో ఇలాంటిది చూడలేదట

డిస్ట్రిబ్యూటర్‌గా, నిర్మాతగా తన 20 ఏళ్ల కెరీర్లో ఎన్నడూ జరగనిది ‘రాజా ది గ్రేట్’ సినిమా విషయంలో జరిగిందన్నాడు దిల్ రాజు. మామూలుగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు తమ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి స్పెషల్ షోలు వేస్తుంటారని.. వాళ్లను, వీళ్లను పిలిచి సినిమా చూపిస్తుంటారని.. కానీ ‘రాజా ది గ్రేట్’ విషయంలో దీనికి భిన్నంగా జరిగిందని రాజు అన్నాడు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్లలో ఓ బ్లైండ్ ఫౌండేషన్.. అంధులైన పిల్లలకు స్పెషల్ షో ప్లాన్ చేసుకుని.. ఆ తర్వాత తమను థియేటరుకి పిలిచిందని రాజు చెప్పాడు. ఇది తనకు పూర్తిగా కొత్త అనుభవమని.. చాలా ఆనందాన్నిచ్చిన విషయమని.. తన కెరీర్లో ఎప్పుడూ ఇలా జరగలేదని రాజు చెప్పాడు.


‘రాజా ది గ్రేట్’ ఎంత పెద్ద సక్సెస్ అయినా.. డబ్బులు తెచ్చిపెట్టినా.. ఈ సినిమా అసలైన విజయం సాధించింది ఇప్పుడే అనిపిస్తోందని రాజు అన్నాడు. నిర్మాతగా ఎన్ని సినిమాలు చేసినా.. ఎంత డబ్బులు సంపాదించినా.. ఇలాంటివి జరిగినపుడు కలిగే ఆనందమే వేరని రాజు అన్నాడు.

ప్రస్తుతం చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అలాంటిది అంధులై ఉండి దాని గురించి బాధపడకుండా ధైర్యంగా ముందుకెళ్తున్న వాళ్లు నిజమైన హీరోలని.. వాళ్లను చూసి అందరూ చాలా నేర్చుకోవాలని రాజు అన్నాడు. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని భగవంతుడే తీసుకెళ్లే వరకు కొనసాగించాలని.. ఎన్ని కష్టాలొచ్చినా పోరాడాలని దిల్ రాజు చాలా ఉద్వేగంగా అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు