కాజల్ మళ్ళీ రేటు పెంచేసిందా?

కాజల్ మళ్ళీ రేటు పెంచేసిందా?

కథ నచ్చితే.. పారితోషకం గురించి పెద్దగా పట్టించుకోం అంటూ స్టార్ హీరోయిన్లు స్టేట్మెంట్లు బాగానే ఇస్తుంటారు. కానీ వాస్తవంగా ఆ విషయంలో తేడా వస్తే ఊరుకోరు. తాము కోరుకున్నంత ముక్కుపిండి వసూలు చేస్తారు. లేదంటే ఆ సినిమా నుంచే తప్పుకుంటారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడిలాగే చేసిందని అంటున్నారు. ఏడాది కిందట కాజల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ‘బ్రహ్మోత్సవం’తో పాటు వరుసగా నాలుగు డిజాస్టర్లు ఎదురవడంతో ఆమె పనైపోయినట్లే కనిపించింది. ఆ సమయంలో కొంచెం తక్కువ పారితోషకానికి ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేయడానికి కూడా రెడీ అయింది.

కానీ ఈ సినిమాతో పాటు ‘ఖైదీ నంబర్ 150’.. ‘మెర్శల్’ సినిమాలు  కూడా బ్లాక్ బస్టర్ కావడంతో కాజల్ దశ మళ్లీ తిరిగింది. దీంతో మళ్లీ పారితోషకం విషయంలో కొండెక్కి కూర్చుందట కాజల్. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా హీరోగా నటించబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర ఆఫర్ చేయగా.. కథ నచ్చి సినిమా చేయడానికి ఓకే చెప్పిందట. కానీ ఈ సినిమాకు రూ.70 లక్షల పారితోషకం అని చెప్పగానే ఆమె నో అనేసిందట. కోటికి తక్కువ సినిమా చేసే అవకాశమే లేదని తేల్చి చెప్పిందట. దీంతో కాజల్ కు టాటా చెప్పేసి వేరే హీరోయిన్ల మీద ఫోకస్ పెట్టిందట చిత్ర బృందం.

ఓవైపు కళ్యాణ్ రామ్ సినిమా ‘ఎమ్మెల్యే’కు కూడా పారితోషకంలో డిస్కౌంట్ ఇచ్చిన కాజల్.. శర్వా సినిమాకు మాత్రం రెమ్యూనరేషన్ విషయం పేచీ పెట్టడం కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే తేజ.. కళ్యాణ్ రామ్ సినిమాలు కమిటై చాలా నెలలైంది. పైగా వాళ్లిద్దరూ ఆమె తొలి సినిమా దర్శకుడు, హీరో. కాబట్టి ఇలాంటి డిస్కౌంట్లు అందరికీ ఉండవని చెప్పకనే చెప్పింది చందమామ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు