అక్కినేని నాస్తికుడు కాదు: కృష్ణకుమారి

అక్కినేని నాస్తికుడు కాదు: కృష్ణకుమారి

టాలీవుడ్ లెజెండ‌రీ హీరో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు అనేక భ‌క్తిర‌స సినిమాల‌లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన సంగ‌తి తెలిసిందే. పాండురంగ మ‌హ‌త్యం, విప్ర‌నారాయ‌ణ వంటి ఎన్నో పాత్ర‌లలో ఆయ‌న జీవించారంటే అతిశ‌యోక్తి కాదు. కానీ, వెండితెర‌పై ఆస్తికుడిగా క‌నిపించే ఏఎన్నార్‌ నిజ‌జీవితంలో మాత్రం నాస్తికుడ‌నే వాద‌న ఉంది. అయితే, ఆ వాద‌న‌ల్లో నిజం లేద‌ని ప్ర‌ముఖ రచయిత్రి కె.వి.కృష్ణకుమారి (కృష్ణక్క) వెల్ల‌డించారు. ఏఎన్నార్ కుటుంబానికి అత్యంత స‌న్నిహితురాలైన కృష్ణకుమారి....ఆయ‌న గురించిన అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా తెలిపారు. అక్కినేని కుటుంబంతో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

అక్కినేని నాగేశ్వరరావును "అన్నయ్య" అంటూ ఆత్మీయంగా పిలిచే వ్య‌క్తుల‌లో కృష్ణకుమారి ఒక‌రు. ఏఎన్నార్ ఫ్యామిలీతో ఆమెకున్న జ్ఞాప‌కాల‌ను  నెమ‌రువేసుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావును అంతా నాస్తికుడంటార‌ని, కానీ ఆయన నాస్తికుడు కాద‌ని ఆమె చెప్పారు. వదిన(అక్కినేని అన్న‌పూర్ణ‌) పోయిన కొత్తలో అన్న‌య్య‌(ఏఎన్నార్‌) విప్రనారాయణుడిలా పూజ గదిలో నిలుచుని పూజ చేస్తూ కనిపించార‌ని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్ప‌టివ‌ర‌కు ఏఎన్నార్ దేవుడికి దణ్ణం పెట్టుకుంటుండగా ఎవరూ చూడలేద‌ని, మొద‌టిసారిగా చూసిన తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. "మీ వదిన నన్ను ఎంతగా ప్రేమించిందో .. నేను అంతకన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాను. ఇప్పుడు వదిన లేదు గదా అని ఈ గదిలో దీపం వెలిగించకపోయినా .. పూజ చేయకపోయినా ఆమె మనసు ఎంతో బాధ పడుతుంది. అందుకే నేను రోజు పూజ చేస్తున్నాను" అని ఏఎన్నార్ త‌న‌తో చెప్పార‌న్నారు. అన్న‌య్య ఆ మాట అనగానే త‌న‌ కళ్ల వెంట నీళ్లొచ్చాయి అని ఆనాటి జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు