పవన్‌ను చూడగానే మాట రాలేదు

పవన్‌ను చూడగానే మాట రాలేదు

అను ఇమ్మాన్యుయెల్.. మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి మూడేళ్లు కాలేదు. అప్పుడే టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోల సరసన సినిమాలు చేసే అవకాశాలు పట్టేసింది. తెలుగులో ఆమె ఇప్పటిదాకా నటించిన సినిమాలు కూడా మరీ పెద్దవేమీ కాదు. మజ్ను, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్..లాంటి మీడియం రేంజ్ సినిమాలే చేసింది.

అలాంటి స్థాయి నుంచి ఒక్కసారిగా పవన్, బన్నీ లాంటి స్టార్ల సరసన చేసే అవకాశాలు అందుకోవడం తనకే చాలా ఆశ్చర్యంగా ఉందని అంటోంది అను. నిజానికి పవన్ కళ్యాణ్ సినిమా అనగానే తనకు చెల్లెలి రోల్ ఏమైనా ఇస్తారేమో అనుకున్నట్లు ఆమె చెప్పడం విశేషం.

పవన్‌తో నటించే అవకాశం, ఈ అనుభవం గురించి అను మాట్లాడుతూ.. ‘‘పవన్ లాంటి పెద్ద స్టార్‌తో సినిమా చేసే అవకాశం వస్తుందని అస్సలు ఊహించలేదు. ఇప్పటికీ ఈ సినిమాలో నటించడం కలగానే అనిపిస్తోంది. మామూలుగా నాకు కొత్త నంబర్ల నుంచి కాల్స్ వస్తే తీసే అలవాటు లేదు. కానీ ఆ రోజు ఎందుకో తెలియదు.. ఫోన్ రాగానే తీశా. పవన్ సార్‌తో సినిమాలో నటించాలని చెప్పారు. ఆయనతో సినిమా అంటే చెల్లెలి పాత్ర ఇస్తారేమో అనుకున్నా. కానీ త్రివిక్రమ్ గారు నన్ను హీరోయిన్‌గా ఎంచుకుని ఆశ్చర్యపరిచారు. చాలా మంచి పాత్ర ఇది. చాలామంది హీరోయిన్లను పరిశీలించి చివరికి నన్ను ఈ పాత్రకు ఎంచుకున్నట్లు చెప్పడం ఆనందాన్నిచ్చింది. ఈ సినిమాకు సంబంధించి తొలి రోజు నాకు, పవన్ సార్‌కు మధ్య రొమాంటిక్ సీన్ తీశారు. మూడుసార్లు డైలాగులు చదువుకుని సెట్‌కు వెళ్లినా.. ఆయన ఎదురు పడగానే డైలాగులు గుర్తుకు రాలేదు. అన్నీ మరిచిపోయాను. ఐతే పవన్ గారు సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ భయం పోగొట్టారు’’ అని అను చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు