‘నక్షత్రం’ ఫెయిల్యూర్ గురించి ఓపెనయ్యాడు

‘నక్షత్రం’ ఫెయిల్యూర్ గురించి ఓపెనయ్యాడు

కృష్ణవంశీ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ‘నక్షత్రం’ మొదలైనపుడు అందరిలోనూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. విలక్షణ దర్శకుడిగా గుర్తింపు ఉన్న కృష్ణవంశీ.. మంచి నటుడిగా పేరు తెచ్చుకున్న ఈ తరం కుర్రాడు సందీప్‌తో సినిమా తీస్తున్నాడంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉంటుందనుకున్నారు. కృష్ణవంశీ ఈ సినిమాతో మళ్లీ తనేంటో రుజువు చేసుకుంటాడనుకున్నారు. కానీ అంచనాలు తలకిందులయ్యాయి. ఇటు కృష్ణవంశీ, అటు సందీప్ కెరీర్లలోనే ఇది అతి పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫలితంపై హీరో సందీప్ ఓ ఇంటర్వ్యూలో ఓపెనయ్యాడు. అతనేమన్నాడంటే..

‘‘నక్షత్రం సినిమాకు ఎలాంటి టాక్ వచ్చినా.. కృష్ణవంశీ మార్కు.. ఇందులోని స్టార్ కాస్ట్.. కాంబినేషన్ వల్ల దీనికి మంచి వసూళ్లే వస్తాయని ఆశించాం. కానీ మేం అనుకున్నట్లుగా జరగలేదు. చాలా నిరాశాజనకమైన ఫలితం వచ్చింది. నిజానికి ఏ సినిమాకైనా సరే.. డబ్బింగ్ చెబుతున్నపుడే దాని రిజల్ట్ ఏంటో తెలిసిపోతుంది. ‘నక్షత్రం’ మీద నాకు ముందే సందేహాలు కలిగాయి. ట్రైలర్ రిలీజైనపుడే నాకు నచ్చలేదు. కృష్ణవంశీ గారు అడిగితే.. నాకు నచ్చలేదని చెప్పాను. ఆయన కొంచెం సేపు ఆగి.. తర్వాత తిట్టారు. ఐతే నన్ను అభిప్రాయం అడిగారు.. నాకేమనిపిస్తే అది చెప్పాను అన్నాను. ఐతే ఈ సినిమా ఫెయిల్యూర్ కావడం వల్ల నాకు కృష్ణవంశీ గారి మీద గౌరవం ఇసుమంతైనా తగ్గలేదు. ఆయనతో పని చేయాలన్నది నా డ్రీమ్. అది నెరవేరింది. పైగా ఈ సినిమా ఎలా ఆడినా నా పెర్ఫామెన్స్‌కు మంచి పేరొస్తుందనుకున్నా. అది వచ్చింది. నిజానికి ఈ సినిమా మొదలయ్యే ముందు నా చివరి సినిమా ‘ఒక్క అమ్మాయి తప్ప’ ఫ్లాప్ అయింది. దీంతో కృష్ణవంశీ గారి దగ్గరికొచ్చి ఎలా సార్ అన్నాను. నిర్మాతలకు నాతో సినిమా చేయడం ఇబ్బందేమో అని చెప్పాను. కానీ ఆయన అవసరమైతే వేరే నిర్మాతలతో సినిమా తీస్తా తప్ప నిన్ను మార్చను అన్నారు. ఆయన లాంటి దర్శకుడు నా మీద అంత నమ్మకం పెట్టుకున్నారు. అంతకంటే ఏం కావాలి? అందుకే నేను కృష్ణవంశీ గారిని ఇప్పటికీ అంతే గౌరవంతో చూస్తాను’’ అని సందీప్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు