పవన్ వచ్చిన రెండు రోజులకు బాలయ్య

పవన్ వచ్చిన రెండు రోజులకు బాలయ్య

గత నెలలోనే ‘పైసా వసూల్’తో పలకరించాడు నందమూరి బాలకృష్ణ. ఆ సినిమా వచ్చిన నాలుగు నెలలకే ఇంకో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు బాలయ్య. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న కొత్త సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణ చాలా వరకు పూర్తయిందట. వచ్చే నెలకల్లా గుమ్మడి కాయ కొట్టేస్తారని సమాచారం.

ఇటీవలే ఈ చిత్రానికి ‘జై సింహా’ అనే టైటిల్ ఖరారు చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా లాంచ్ చేయబోతున్నారు. నవంబరు 1న ‘జై సింహా’ తొలి చూపును పరిచయం చేస్తామని నిర్మాత సి.కళ్యాణ్ ప్రకటించారు. ఈ సినిమా రిలీజ్ డేట్‌ కూడా ఆయన కన్ఫమ్ చేశారు. 2018 జనవరి 12న ‘జై సింహా’ విడుదలవుతుందని కళ్యాణ్ చెప్పారు. జనవరి 10న పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ సినిమా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

‘జై సింహా’లో బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు నటిస్తుండటం విశేషం. నయనతార లీడ్ హీరోయిన్‌ కాగా.. ‘పిల్ల జమీందార్’ భామ హరిప్రియతో పాటు మలయాళ హీరోయిన్ నటాషా దోషి కూడా ఇందులో బాలయ్యకు జోడీగా నటిస్తున్నారు. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రాలకు సంగీతం అందించిన చిరంతన్ భట్ ‘జై సింహా’కూ పని చేస్తున్నాడు. బాలయ్య-కె.ఎస్.రవికుమార్ కాంబినేషన్లో రాబోతున్న తొలి సినిమా ఇదే. ఈ చిత్రం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని సమాచారం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English