ఆరో హిట్టా.. పదో ఫ్లాపా?

ఆరో హిట్టా.. పదో ఫ్లాపా?

హీరోగా తన సక్సెస్ రేట్ పేలవం అంటూ ఈ మధ్యే ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు రామ్. అతను ఇప్పటిదాకా 14 సినిమాలు చేస్తే అందులో విజయవంతమైనవి ఐదే. తొమ్మిది సినిమాలు ఫ్లాపయ్యాయి. మరి ఇప్పుడు రామ్ కొత్త సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’ ఏ కేటగిరీలోకి చేరుతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇది అతడికి ఆరో హిట్టు అవుతుందా.. లేక పదో ఫ్లాప్‌గా నిలుస్తుందా అన్నది శుక్రవారం తేలిపోతుంది.

వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ఎట్టకేలకు గత ఏడాది ‘నేను శైలజ’తో మంచి విజయాన్నందుకున్నాడు రామ్. అంతకుముందు మాస్ ఇమేజ్ కోసం వెంపర్లాడి చాలా వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. రామ్ మంచి నటుడు, పైగా కావాల్సినంత ఎనర్జీ ఉంది. వీటిని సద్వినియోగం చేసుకుని తనకు సరిపోయే లవర్ బాయ్ పాత్రలు చేయకుండా.. మాస్ ఇమేజ్ కోసం పరితపించిపోయి ఫ్లాపులు ఎదుర్కొన్నాడు రామ్.

ఇలాంటి సమయంలో ‘నేను శైలజ’ రామ్‌‌కు అత్యావశ్యక విజయాన్నందించింది. అందులో సింపుల్‌గా సాగిన రామ్ పాత్ర అందరినీ ఆకట్టుకుంది. కానీ ఈ సక్సెస్ నుంచి రామ్ ఏం నేర్చుకున్నాడో ఏమో కానీ.. మళ్లీ పాత స్టయిల్లో ‘హైపర్’ చేసి బోల్తా కొట్టాడు. దీంతో మళ్లీ జ్నానోదయం అయింది. ‘నేను శైలజ’ దర్శకుడు కిషోర్ తిరుమలతో మళ్లీ ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చేశాడు. అదే.. ఉన్నది ఒకటే జిందగీ. ఈ సినిమాపై పాజిటివ్ బజ్ ఉంది. మంచి అంచనాల మధ్య రిలీజవుతున్న ఈ చిత్రం ఆ అంచనాల్ని ఏమేరకు అందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు