ఆ ఇద్దరు కమెడియన్లూ హీరోలైపోతున్నారు

ఆ ఇద్దరు కమెడియన్లూ హీరోలైపోతున్నారు

కమెడియన్లు ఒక్కొక్కరుగా హీరోలైపోతున్నారు టాలీవుడ్లో. ఇప్పటికే సునీల్, శ్రీనివాసరెడ్డి, సప్తగిరి లాంటి కమెడియన్లు హీరోల అవతారం ఎత్తారు. ఇప్పుడు ఇంకో ఇద్దరు కమెడియన్లు లీడ్ రోల్స్‌లోకి మారుతున్నారు. అందులో ఒకరు షకలక శంకర్ కాగా, మరొకరు ‘సత్యం’ రాజేష్. వీళ్లిద్దరూ హీరోలుగా నటిస్తున్న కొత్త సినిమాల ప్రకటనలు ఈ రోజు వచ్చాయి.

షకలక శంకర్ హీరోగా ‘డ్రైవర్ రాముడు’ అనే సినిమా తెరకెక్కుతోంది. ‘డ్రైవర్ రాముడు’ పేరుతో సీనియర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆయన్ని పోలిన అవతారంలోకి మారాడు షకలక శంకర్ ఈ సినిమాలో. ఇదేదో పేరడీ సినిమాలాగా కనిపిస్తోంది పోస్టర్ చూస్తుంటే. రాజ్ సత్య అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ‘సినిమా పీపుల్’ అనే కొత్త  బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొన్నాళ్ల కిందటే మొదలై షూటింగ్ జరుపుకుంటోంది.

మరోవైపు సత్యం రాజేష్ హీరోగా ‘గీతాంజలి’ దర్శకుడు రాజ్ కిరణ్ ఓ సినిమా తీయబోతున్నాడు. ‘గీతాంజలి’లో సత్యం రాజేష్ ఓ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన రాజ్ కిరణ్.. ఆ తర్వాత ‘త్రిపుర’, ‘లక్కున్నోడు’ లాంటి ఫ్లాప్ సినిమాలు తీశాడు. ఇప్పుడు సత్యం రాజేష్ హీరోగా సినిమా తీసే సాహం చేయబోతున్నాడు. సత్యం రాజేష్ ఇంతకుముందు ‘నాయకి’ అనే సినిమాలో హీరో కాని హీరో పాత్ర చేశాడు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా మారుతున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు