థియేటర్లలో జాతీయ గీతం.. కమల్ సలహా

థియేటర్లలో జాతీయ గీతం.. కమల్ సలహా

థియేటర్లలో సినిమా మొదలవడానికి ముందు జాతీయ గీతం ప్రదర్శించడం.. అందరూ లేచి నిలబడాలంటూ గత ఏడాది షరతు పెట్టడంపై మొదట్నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశభక్తి అనేది ఎవరికి వారు ప్రదర్శించాలి తప్ప.. బలవంతంగా ఇలా రుద్దడం అన్నది సబబు కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని ఇంతకుముందు సమర్థిస్తూ మాట్లాడిన సుప్రీం కోర్టు సైతం.. ఈ నిబంధనపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలని ఇటీవలే సూచించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులు ఈ నిబంధనను వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటీవలే రాజకీయాలపై చాలా చురుగ్గా స్పందిస్తున్న కమల్ హాసన్ కూడా ఈ విషయంలో తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడాన్ని కమల్ తప్పుబట్టారు. ఇలాంటి విషయాల్లో జనాలపై ఏదీ బలవంతంగా రుద్దకూడదడని ఆయన అభిప్రాయపడ్డారు. సింగపూర్‌లో ప్రభుత్వం జాతీయ గీతాన్ని నిర్దేశిత సమయంలో టీవీలో టెలికాస్ట్ చేయిస్తుందని.. అలాగే మన ప్రభుత్వం కూడా దూరదర్శన్ ఛానెల్ ద్వారా ఏదో ఒక టైం ప్రకారం ప్రదర్శించాలని.. అంతే తప్ప థియేటర్లలో జాతీయ గీతం ప్రదర్శించడం.. జనాలు లేచి నిలుచోవాలని షరతు పెట్టడం సమంజసం కాదని కమల్ అభిప్రాయపడ్డాడు.

మరో తమిళ నటుడు అరవింద్ స్వామి సైతం ఈ విషయంపై తన అభిప్రాయం చెప్పాడు. ఈ నిబంధన సమంజసం కాదన్నాడు. కేవలం థియేటర్లలో మాత్రమే జాతీయ గీతాన్ని ప్రదర్శించడం దేనికని.. పబ్లిక్ ప్లేసుల్లో.. షాపింగ్ మాల్స్‌లో.. స్టేడియాల్లో.. ఇలా అన్ని చోట్లా జాతీయ గీతం వినిపించాలి తప్ప థియేటర్లకు దీన్ని పరిమితం చేయడం కరెక్ట్ కాదన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు