ఆ సినిమాను 200 మందికి చూపించేశాడట..

ఆ సినిమాను 200 మందికి చూపించేశాడట..

తెలుగులో హీరోగా మంచి పాపులారిటీ సంపాదించి.. ఆ తర్వాత వరుస ఫ్లాపులతో కొన్నేళ్ల పాటు టాలీవుడ్‌కు దూరమైపోయాడు సిద్దార్థ్. ఇప్పుడతను హార్రర్ మూవీ ‘గృహం’తో మళ్లీ మన ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. నవంబరు 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐతే ఈ సినిమాను ఇప్పటికే 200 మంది ప్రేక్షకులకు చూపించేసినట్లు సిద్దార్థ్ వెల్లడించడం విశేషం. ‘గృహం’ స్క్రిప్టును తాను, దర్శకుడు మిలింద రావు కలిసి నాలుగేళ్ల పాటు రాసినట్లు సిద్దార్థ్ చెప్పడం గమనార్హం.

‘‘నేను, మిలింద్ దాదాపు రెండు దశాబ్దాల కిందట మణిరత్నం సర్ దగ్గర ఒకేసారి అసిస్టెంట్లుగా చేరాం. మా మధ్య గొప్ప అనుబంధం ఉంది. మేమిద్దరం కలిసి ఎన్నో హార్రర్ సినిమాలు చూశాం. అవి చూసి, అనలైజ్ చేసుకున్న తర్వాత మనమెందుకు ఇలాంటి సినిమా చేయలేం అనిపించేది. కొన్నిసార్లు థియేటర్లో సినిమా చూసి బయటికొచ్చాక జనాలు మాట్లాడుకోవడం విన్నాం. ఇలాంటివి మనోళ్లు చేయలేరు అని తేలిగ్గా కొట్టిపడేసేవాళ్లు. ఆ మాటలు కోపం తెప్పించినా.. తర్వాత ఇంటికెళ్లి ఆలోచిస్తే కరెక్టేగా అనిపించేది. ఈ ఆలోచన నుంచే అంతర్జాతీయ స్థాయికి తగ్గ హార్రర్ సినిమా చేయాలన్న పట్టుదల పెరిగింది.

మిలింది ఫారిన్లో సినిమా కోర్సు చేశాడు. అక్కడ అతను చివర్లో థీసిస్ కోసం చేసింది హార్రర్ సినిమానే. దర్శకుడిగా తన తొలి సినిమాగా కూడా హార్రర్ జానరే ఎంచుకున్నాడు. నేను, అతను కలిసి నాలుగేళ్లు ఈ స్క్రిప్టు రాశాం. నాలుగేళ్లు ఓ స్క్రిప్టు రాయడమేంటి అనిపించొచ్చు. కొన్నిసార్లు అలాగే జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో రెండు వారాల్లో కూడా ఒక స్క్రిప్టు అయిపోవచ్చు. మాకు తెలిసిన వాళ్ల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా స్క్రిప్టు రాసి సినిమా చేశాం. ఎంతో రీసెర్చ్ చేశాక ఈ సినిమా తెరకెక్కింది. ఈ క్రమంలో మేం చాలా విషయాలు నేర్చుకున్నాం.
సినిమా అంతా అయ్యాక మేం 200 మంది ప్రేక్షకుల్ని సెలక్ట్ చేసి వాళ్లకు స్పెషల్ స్క్రీనింగ్ వేశాం. సినిమా చూశాక వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుని.. ఫైనల్ టచప్స్ చేశాం. ఈ సినిమా ప్రొజెక్టర్ చెప్పిన ఒక మాట మాకు పెద్ద కాంప్లిమెంట్. సినిమా ప్రదర్శన అయిన రోజు రాత్రి సీట్లన్నీ లూజ్ అయిపోతే మళ్లీ టైట్ చేయాల్సి వచ్చిందన్నాడు. జనాలు ఆ స్థాయిలో భయంతో షేక్ అయిపోవడంతో సీట్లు అలా వదులు అయిపోయాయి. ఇంతకుముందు ‘బొమ్మరిల్లు’ సినిమాను జనాల మధ్య చూసినపుడు చివర్లో నేను ‘ముద్ద దిగట్లేదు నాన్నా’ అంటూ చెప్పే డైలాగుకి జనాలు కన్నీళ్లు పెట్టుకోవడం చూశా. ఇప్పుడు ‘గృహం’ సినిమాకు సంబంధించి నేను అందుకున్న గొప్ప కాంప్లిమెంట్ ఇది’’ అని సిద్దార్థ్ తెలిపాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు