రామ్‌ను బాధ పెట్టిన ఆ రెండు సినిమాలు

రామ్‌ను బాధ పెట్టిన ఆ రెండు సినిమాలు

దీపావళి కానుకగా విడుదలై సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకున్న ‘రాజా ది గ్రేట్’లో రామ్ నటించాల్సింది. కానీ ఈ సినిమా అతడి చేజారింది. రవితేజ దగ్గరికెళ్లింది. ఐతే ఈ సినిమాను మిస్సవడం గురించి తనకే బాధా లేదని రామ్ ఇంతకుముందే చెప్పాడు. ఐతే తాను తన కెరీర్లో ఎంతో ఇష్టపడి, కథను చాలా నమ్మి చేసిన రెండు సినిమాలు మాత్రం తనను చాలా బాధపెట్టాయని రామ్ తెలిపాడు.

అందులో మొదటి సినిమా ‘జగడం’ అని వెల్లడించాడతను. ‘దేవదాసు’ లాంటి బ్లాక్ బస్టర్‌తో హీరోగా పరిచయమైన తాను.. సుకుమార్ చెప్పిన కథ ఎంతో నచ్చి ‘జగడం’ చేసినట్లు రామ్ తెలిపాడు. ఐతే ఆ సినిమా సరిగా ఆడకపోవడంతో ప్రేమలో విఫలమైనంత బాధ కలిగిందని రామ్ చెప్పాడు. అప్పటికి తన వయసు కూడా తక్కువ కావడంతో ఫెయిల్యూర్లను లైట్ తీసుకునేంత పరిణతి తనకు లేకపోయిందని అతను చెప్పాడు.

‘జగడం’ తర్వాత తనకు ఎక్కువ బాధ కలిగించింది ‘ఎందుకంటే ప్రేమంట’ సినిమానే అని రామ్ తెలిపాడు. కరుణాకరన్ చెప్పిన కథను నమ్మి తమ సొంత బేనర్లో ఎంతో కష్టపడి ఈ సినిమా చేశామన్నాడు. కానీ ఈ సినిమా ఫలితం కూడా తేడా కొట్టిందని.. అప్పుడు కూడా చాలా బాధపడ్డానని.. ఐతే ఆ తర్వాత ఫెయిల్యూర్లను తేలిగ్గా తీసుకోవడం అలవాటైందని అన్నాడు. తన కెరీర్లో సక్సెస్ రేట్ చాలా పేలవమని రామ్ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అతనిప్పటిదాకా 14 సినిమాలు చేస్తే అందులో విజయవంతమైనవి ఐదే. ఐతే ఈ శుక్రవారం రాబోతున్న ‘ఉన్నది ఒకటే జిందగీ’ కచ్చితంగా సక్సెస్ అవుతుందని ధీమాగా ఉన్నాడు రామ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English