రివ్యూలు కిల్‌ చేసాయా? నిజంగా సీన్లేదా?

రివ్యూలు కిల్‌ చేసాయా? నిజంగా సీన్లేదా?

సినిమా మార్కెట్‌ని ఏ సెంటర్‌, బి-సి సెంటర్స్‌గా విడదీసి చూసే రోజుల నుంచి డొమస్టిక్‌ మార్కెట్‌, ఓవర్సీస్‌ మార్కెట్‌గా విభజించి చూసే వరకు పరిణితి చెందింది. లోకల్‌గా ఒక సినిమా ఎంత బాగా ఆడినా కానీ ఓవర్సీస్‌లో ఒక సినిమా అలాగే ఆడుతుందనే నమ్మకం లేదు. ముఖ్యంగా కమర్షియల్‌ ఫార్ములా సినిమాలకి, యాక్షన్‌ ప్రధాన మాస్‌ సినిమాలకి ఓవర్సీస్‌లో గిరాకీ వుండదు.

ఉదాహరణకి బోయపాటి శ్రీను సినిమాలు లోకల్‌గా ఎంత పెద్ద హిట్‌ అయినా కానీ ఓవర్సీస్‌ ప్రేక్షకులని ఆకట్టుకోలేవు. అలాగే ఓవర్సీస్‌ ఆడియన్స్‌ బాగా కనక్ట్‌ అయిన సినిమాలు అదే స్థాయిలో బి-సి సెంటర్ల ప్రేక్షకులని మెప్పించలేవు. ఓవర్సీస్‌లో బాగా ఆడే సినిమాలని రివ్యూలు, రేటింగులు ప్రభావితం చేస్తాయనేది కొందరి నమ్మకం. అందులో కొంతవరకు వాస్తవం లేకపోలేదు కానీ కేవలం రేటింగుల మీదే ఆధార పడి ఒక సినిమా చూడాలని ప్రేక్షకులు ఫిక్స్‌ అవరు. పబ్లిక్‌ టాక్‌, సోషల్‌ మీడియా ద్వారా వచ్చే టాక్‌ వల్ల కూడా పలు సినిమాలు రేటింగులతో సంబంధం లేకుండా ఆడిన సందర్భాలున్నాయి.

ఈ నేపథ్యంలో లోకల్‌గా బాగా ఆడుతోన్న 'రాజా ది గ్రేట్‌' ఓవర్సీస్‌ మార్కెట్లో మాత్రం ఫెయిలవడానికి రివ్యూలే కారణమని సదరు చిత్ర బృందం ఫీలవుతోందట. అయితే సినిమా బాగుందనే టాక్‌ స్ప్రెడ్‌ అయినట్టయితే మంగళవారం విడుదలైన సినిమాకి కనీసం శని, ఆదివారానికి అయినా కలక్షన్లు పెరగాలి. కానీ రాజా ది గ్రేట్‌ సినిమా విషయంలో అది జరగలేదు. కాబట్టి ఈ చిత్రం పాజిటివ్‌ మౌత్‌ టాక్‌ రాబట్టుకోవడంలో ఖచ్చితంగా విఫలమైందనే అనుకోవాలి. కేవలం బి-సి సెంటర్స్‌ ప్రేక్షకులని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తోన్న అనిల్‌ రావిపూడి తన సినిమాల్లో కాస్త 'తెలివైన' అంశాలని కూడా జోడిస్తే, తనకు కామెడీపై వున్న గ్రిప్‌కి మరింత బలం చేకూరి తన చిత్రాలు మరింత మందిని మెప్పిస్తాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు