రవితేజ కొడుకు పోజు కొట్టేస్తున్నాడట

రవితేజ కొడుకు పోజు కొట్టేస్తున్నాడట

కంటెంట్ రొటీనే అయినా.. ఓ మోస్తరుగా ఎంటర్టైన్మెంట్‌ ఇవ్వడం ద్వారా ఓకే అనిపించింది ‘రాజా ది గ్రేట్’. పండగ సీజన్లో పోటీ లేకుండా రిలీజ్ చేయడంతో ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయి. మొత్తానికి ఇది సక్సెస్ ఫుల్ సినిమా అనిపించుకుంది. ఈ నేపథ్యంలో రవితేజ చాలా సంతోషంగా కనిపిస్తున్నాడు. తన చివరి రెండు సినిమాలూ ఫ్లాప్ కావడం.. పైగా కెరీర్లో ఎన్నడూ లేని విధంగా రెండేళ్లు గ్యాప్ వచ్చేయడం.. ఆ తర్వాత చేసిన సినిమా మంచి వసూళ్లు సాధించడంతో రవితేజ ఆనందం వ్యక్తం చేశాడు.

ఈ సినిమాతో తన కొడుకు మహాధన్ తెరంగేట్రం చేయడం.. అతడికీ మంచి పేరు రావడం కూడా చాలా ఆనందంగా ఉందన్నాడు రవితేజ. ఈ సినిమాకు అందుకుంటున్న ప్రశంసలతో తన కొడుకు పొంగిపోతూ.. తన ముందే పోజు కొడుతున్నాడని మాస్ రాజా చెప్పాడు.

‘‘రాజా ది గ్రేట్ ఇలాంటి విజయాన్నందుకోవడంత మా చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరి ముఖం వెలిగిపోతోంది. విజయం ఇచ్చే ఉత్సాహం ఇలాగే ఉంటుంది. ఈ సినిమాలో మా అబ్బాయి కూడా నటించాడు. తనకీ సెల్ ఫోన్ మెసేజ్‌లు చాలా వస్తున్నాయి. వాడూ పొంగిపోతున్నాడు. అవి చూసుకుని నా ముందే పోజులు కొడుతున్నాడు’’ అని రవితేజ అన్నాడు.

‘రాజా ది గ్రేట్’ దర్శకుడు అనిల్‌కు చాలా క్లారిటీ ఉందని.. అతను ఇలాగే ఉండాలని.. చెడగొట్టేందుకు చాలామంది ప్రయత్నిస్తారని.. ఎక్కడికో తీసుకెళ్లిపోతామని అంటుంటారని.. అతను మారకుండా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నానని రవితేజ చెప్పాడు. తన కెరీర్లో చాలా గ్యాప్ తర్వాత వచ్చిన సినిమా కావడంతో ఈ విజయం తనకు మరింత ప్రత్యేకమని మాస్ రాజా అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు