రజినీ చురుకు పుట్టించే ట్వీట్ చేశాడు

రజినీ చురుకు పుట్టించే ట్వీట్ చేశాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ వెండితెర మీద చాలా దూకుడుగా ఉండే పాత్రల్లో కనిపిస్తుంటాడు. కానీ నిజ జీవితంలో మాత్రం రజినీ చాలా మెతకగా ఉంటాడు. ఆయనది నెమ్మదైన మనస్తత్వం. ఎవరినీ ఒక మాట అనరు. విమర్శలు గుప్పించరు. వివాదాస్పద అంశాల మీద తన అభిప్రాయాల చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఐతే రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు ఇలాంటి యాటిట్యూడ్ ఎంతమాత్రం పని చేయదు.

కొంచెం దూకుడుగా ఉంటేనే రాజకీయాల్లో రాణించగలరు ఎవరైనా. కమల్ హాసన్ సరిగ్గా ఆ తరహాలోనే వ్యవహరిస్తున్నాడు. కానీ కమల్ లాగే రాజకీయ అరంగేట్రం చేయాలనుకుంటున్న రజినీ మాత్రం నొప్పించక తానొవ్వక అనే తరహాలోనే వ్యవహారాలు నడుపుతున్నాడు.

ఇలాంటి సమయంలోనే ‘మెర్శల్’ సినిమా మీద పెద్ద వివాదాలు మొదలయ్యాయి. దీనిపై తమిళ సినీ పరిశ్రమ మొత్తం ఏకమైంది. ఈ సినిమాలో జీఎస్టీకి వ్యతిరేకంగా ఉన్న డైలాగుల్ని తొలగించాలన్న వాదనను తీవ్రంగా ఖండిస్తున్నారు అందరూ. కమల్ ఈ విషయంలో తీవ్రంగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. మిగతా సినీ ప్రముఖులూ దీనిపై స్పందిస్తున్నారు. దీంతో రజినీ కూడా మాట్లాడక తప్పలేదు.

ఆయన తాజాగా ‘మెర్శల్’ వివాదంపై ఒక ట్వీట్ చేశారు. ‘మెర్శల్’ ఓ ప్రధాన సమస్యను చాలా చక్కగా చర్చించిందని.. ఈ చిత్ర బృందానికి అభినందనలని ట్వీట్లో పేర్కొన్నాడు రజినీ. ఐతే సూటిగా, వివరంగా తన అభిప్రాయం చెప్పకుండా ఇలాంటి ట్వీట్ పెట్టడమేంటి అని కొందరు విమర్శిస్తున్నా.. భారతీయ జనతా పార్టీకి ఏ రకంగానూ వ్యతిరేకంగా వ్యవహరించని రజినీ ఈ మాత్రం చురుకు పుట్టించే ట్వీట్ చేయడం కూడా విశేషమే అంటున్నారు మరికొందరు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు