పెళ్లిచూపులు తర్వాత ఇన్నాళ్లకు...

పెళ్లిచూపులు తర్వాత ఇన్నాళ్లకు...

సినీ పరిశ్రమలో దర్శకుడిగా తొలి అవకాశం దక్కించుకోవడమే చాలా కష్టమైన విషయం. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే.. ఇక తిరుగుండదు. సినిమా విడుదలైన రోజు సాయంత్రానికే నిర్మాతలు అడ్వాన్సులతో రెడీ అయిపోతారు. తొలి సినిమా బాగా ఆడుతుందని నమ్మకమున్న దర్శకులు.. తర్వాతి ప్రాజెక్టులకు ముందే కథలు రెడీ చేసి పెట్టుకుంటారు.

వెంటనే సినిమాలు మొదలుపెట్టేస్తుంటారు. కానీ ‘పెళ్లిచూపులు’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్నందుకున్న తరుణ్ భాస్కర్ మాత్రం తన రెండో సినిమా విషయంలో హడావుడి పడలేదు. ఆ సినిమా విడుదలైన ఏడాది తర్వాత కానీ అతను తన రెండో సినిమా మొదలుపెట్టలేదు.

గత ఏడాది కాలంలో తరుణ్ తర్వాతి సినిమా విషయంలో రకరకాల ప్రచారాలు నడిచాయి. తనకు మంచి పేరు తెచ్చిపెట్టిన ‘సైన్మా’ షార్ట్ ఫిలింను సినిమాగా మారుస్తాడని.. సీనియర్ హీరో వెంకటేష్ హీరోగా ఓ సినిమా చేస్తాడని.. ఇలా ఊహాగానాలు వినిపించాయి. కానీ ఇవేవీ కాకుండా అందరూ కొత్త వాళ్లతోనే తన రెండో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు తరుణ్.

అతడి తొలి సినిమా ‘పెళ్లిచూపులు’ను తన బేనర్ మీద రిలీజ్ చేసిన సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతుండటం విశేషం. తరుణ్ అడిగితే పేరున్న హీరోలే చేయడానికి రెడీగా ఉండగా.. అతను మళ్లీ కొత్త వాళ్లతోనే సినిమా చేయాలనుకోవడం ఆశ్చర్యమే. మరి రెండో సినిమాతోనూ ‘పెళ్లిచూపులు’ మ్యాజిక్ కొనసాగిస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు