రాజు-రాజ్ తరుణ్.. లవర్

రాజు-రాజ్ తరుణ్.. లవర్

దిల్ రాజు ఈ ఏడాది చేసిన పెద్ద సినిమా ‘డీజే’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఆయన పరిమిత బడ్జెట్లో చేసిన సినిమాలన్నీ అద్భుత ఫలితాన్నిచ్చాయి. శతమానం భవతి, నేను లోకల్, ఫిదా.. ఈ మూడూ బ్లాక్ బస్టర్లయ్యాయి. మరో మీడియం బడ్జెట్ సినిమా ‘రాజా ది గ్రేట్’ కూడా ఆయనకు మంచి ఫలితాన్నందించేలా కనిపిస్తోంది.

రాజు బేనర్లో రాబోతున్న తర్వాతి సినిమా ‘ఎంసీఏ’ కూడా తక్కువ బడ్జెట్లోనే తెరకెక్కింది. దీని తర్వాత దిల్ రాజు మరో చిన్న సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. యువ కథానాయకుడు రాజ్ తరుణ్ హీరోగా రాజు ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఆ సినిమాకు ‘లవర్’ అనే టైటిల్ కూడా కన్ఫమ్ చేశారు.

‘అలా ఎలా’ లాంటి హిట్ మూవీతో దర్శకుడిగా పరిచయమైన అనీష్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఇంకొన్ని రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్తుంది. ‘అలా ఎలా’ మంచి విజయం సాధించినప్పటికీ అనీష్ కృష్ణ వెంటనే రెండో సినిమా చేయలేకపోయాడు. ‘అలా ఎలా’కు సీక్వెల్ చేయాలనుకుని వెనక్కి తగ్గిన అనీష్.. ఆ తర్వాత అల్లరి నరేష్ హీరోగా ఓసినిమాను మొదలుపెట్టాలని చూశాడు.

కానీ అది కూడా ముందుకు కదల్లేదు. చివరికి దిల్ రాజు అతడికి ఛాన్సిచ్చాడు. మరోవైపు రాజ్ తరుణ్ సంక్రాంతికి ‘రాజు గాడు’తో ప్రేక్షకుల్ని పలకరించబోతున్నాడు. ఈ చిత్రాన్ని లేడీ డైరెక్టర్ సంజనా రెడ్డి రూపొందించింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’.. ‘సినిమా చూపిస్త మావ’ సినిమాల్ని దిల్ రాజే రిలీజ్ తన బేనర్ మీద రిలీజ్ చేసి మంచి ఫలితాన్నందుకున్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు