మెర్శల్ గొడవపై విజయేంద్ర ఏమన్నాడంటే..

మెర్శల్ గొడవపై విజయేంద్ర ఏమన్నాడంటే..

తమిళంలో దీపావళి కానుకగా విడుదలైన ‘మెర్శల్’ సినిమా చుట్టూ పెద్ద వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. జీఎస్టీకి వ్యతిరేకంగా ఇందులో డైలాగులుండటంపై భారతీయ జనతా పార్టీ మండిపడటంతో ఆ డైలాగుల్ని తొలగించే వరకు పరిస్థితి వెళ్లింది. మరోవైపు వైద్యుల గురించి, కార్పొరేట్ హాస్పిటళ్ల గురించి ఇందులో సెటైర్లు వేయడం ఆ వర్గాలకు ఆగ్రహం తెప్పించింది.

తమిళనాడు వైద్యులు ‘మెర్శల్’ పైరసీని వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు.. లీగల్ చర్యలకు కూడా ఉపక్రమిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రెండు వివాదాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటిదాకా ఎవరూ స్పందించలేదు. ఐతే ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ దీనిపై రెస్పాండయ్యాడు.

‘మెర్శల్’లో డైలాగుల్ని ఆయన సమర్థించారు. ఇలా ప్రశ్నించడం అవసరం అని ఆయన అన్నారు. తమిళనాట ఈ సినిమాకు వ్యతిరేకంగా వైద్యులు తీర్మానాలు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసిందని.. ఐతే వాళ్ల వ్యతిరేకతే తమ సినిమాకు ప్రచారం అవుతోందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. తాము చెప్పింది తప్పు కాదని.. ఇలా ప్రశ్నించే సినిమాలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సింగపూర్లో 8 శాతం జీఎస్టీ ఉందని.. కానీ అక్కడ అందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందుతోందని ఆయన అన్నారు. మన దగ్గర పూర్తి భిన్నమైన పరిస్థితులున్నాయని.. 28 శాతం జీఎస్టీ కడుతున్నామని.. కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీకి గురవుతున్నామని విజయేంద్ర అన్నారు. పన్నులు చెల్లిస్తున్నా సరైన వైద్యం అందట్లేదన్నారు. ఈ విషయాల్నే తమ సినిమాలో చూపించినట్లు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English