నాలుగు రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టేసింది

నాలుగు రోజుల్లో వంద కోట్లు కొల్లగొట్టేసింది

ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలకు మాత్రమే వంద కోట్ల క్లబ్ అనేది సాధ్యమయ్యేది. మూడు రోజుల్లో వంద కోట్లు.. ఐదు రోజుల్లో వంద కోట్లు.. పది రోజుల్లో వంద కోట్లు అని చెప్పుకునేవాళ్లు. కానీ గత కొన్నేళ్లలో సౌత్ సినిమాలకు కూడా అది చిన్న విషయం అయిపోయింది. ఇక్కడి స్టార్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వంద కోట్ల క్లబ్బులో చేరడం మామూలు విషయంగా మారిపోయింది.

మహేష్ బాబు సినిమా ‘స్పైడర్’ నెగెటివ్ టాక్ తెచ్చుకుని కూడా వంద కోట్ల క్లబ్బులో అడుగుపెట్టింది. ఇక కొంచెం డివైడ్‌ టాక్‌తో మొదలైన విజయ్ సినిమా ‘మెర్శల్’ కేవలం నాలుగే రోజుల్లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం విశేషం. తెలుగు వెర్షన్ రిలీజ్ కాకున్నా ఇంత వేగంగా వంద కోట్ల గ్రాస్ తేవడం ఆశ్చర్యం కలిగించే విషయమే.

విజయ్‌ కెరీర్లో ఇది ఐదో వంద కోట్ల సినిమా కావడం విశేషం. ఇంతకుముందు తుపాకి, కత్తి, తెరి, భైరవ సినిమాలు కూడా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశాయి. ‘మెర్శల్’కు టాక్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి. కొన్ని కాంట్రవర్శీలు కూడా ఈ సినిమాకు బాగానే కలిసొచ్చాయి. ముఖ్యంగా జీఎస్టీ మీద విజయ్ ఈ సినిమాలో సెటైర్లు వేయడం.. దానిపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేయడం.. కొన్ని డైలాగులు తీసేసే వరకు పరిస్థితి వెళ్లడంతో ఈ సినిమాపై పెద్ద చర్చే నడిచింది.

‘మెర్శల్’ తెలుగు వెర్షన్ ‘అదిరింది’ వారం రోజులు ఆలస్యంగా.. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ కథ అందించడం విశేషం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు