పవన్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సినిమా..

పవన్ చేతుల మీదుగా ఎన్టీఆర్ సినిమా..

మన అగ్ర హీరోలు ఒకరితో ఒకరు రాసుకు పూసుకు తిరిగినా.. పరస్పరం సహకారం అందించుకున్నా.. జనాల్లో భలే ఆసక్తి కలుగుతుంది. ఇటీవలే ‘జై లవకుశ’ సినిమా చూసి చరణ్ ఎన్టీఆర్‌ను అభినందించినపుడు జనాలు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇప్పుడు మరో ఆశ్చర్యకర కలయిక చూడబోతున్నాం. ఎన్టీఆర్ కొత్త సినిమా పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోబోతుండటం విశేషం.

తన ఆప్త మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు పవన్ కళ్యాణే క్లాప్ కొట్టబోతున్నాడట. సోమవారం ఉదయం 11 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో ఈ చిత్ర ప్రారంభోత్సవం జరగనుంది. ఈ వేడుకకు పవన్ కళ్యాణే ముఖ్య అతిథి అని సమాచారం. అతనే క్లాప్ కొట్టి సినిమాను ఆరంభించబోతున్నాడట. కాబట్టి పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూసే అవకాశం రాబోతోంది.

ఇప్పుడు సినిమాను లాంఛనంగా ఆరంభించి.. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ పవన్ సినిమాను ముగించే పనిలో ఉన్నాడు. ఆ చిత్రం నవంబరు నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటాడు త్రివిక్రమ్. జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాను నిర్మిస్తున్న రాధాకృష్ణే త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నాడు. సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్‌ను కూడా ఈ సినిమాకు కొనసాగిస్తున్నాడు త్రివిక్రమ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు